తెలుగులో తనకే దమ్ముందని అదేపనిగా చెప్పుకునే పత్రిక ఛానల్ ఒకటుంది. ఈ మాటలు వినగానే అదేదో తెలిసిపోతుంది కదా.. అయితే ఈ దమ్మును ఇటీవల చాలా జాగ్రత్తగా ఎంపిక చేసిన ప్రకారమే ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. మొదట్లో టిఆర్ఎస్పై వున్న దూకుడు టిడిపిపై వుండేది కాదు. దానికి గాను వేటు పడిన తర్వాత ఏదో రాజీ కుదిరి ఉభయ కుశలోపరి తరహాలో నడుస్తున్నది. టిసర్కారుకు కొన్ని సార్లు నమస్తేను మించిన సేవలందిస్తున్నది కూడా. మరీ ముఖ్యంగా మల్లన్నసాగర్ సమస్యపై ఆందోళనను తక్కువ చేసి సమస్య పరిష్కారమై పోయినట్టు చూపించడానికీ ఈ దమ్మున్న పత్రిక చాలా తంటాలు పడుతున్నది.ప్రత్యామ్నాయ పథకాలకూ హరీష్ మధ్యవర్తిత్వానిక సంబంధించి ి మొదటిపేజీలో కథలపై కథలు ప్రచురిస్తున్నది. రిజర్వాయరులో చేపలు పట్టుకోవడానికి కూడా భూములిచ్చిన వారికి అవకాశముంటుందని ఒక వూహాచిత్రం ప్రకటించింది. ఇదంతా ఎందుకంటే – కేవలం టిఆర్ఎస్ కోసమే కాదట. ఈ ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థపై ప్రేమతో. వారికి ఆటంకాలు లేకుండా చేయడానికి ఇన్ని తంటాలు పడుతున్నట్టు కథలు వదలుతున్నట్టు మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిజంగా పరిశీలించేవారికి కూడా ఈ నష్ట నివారణ కథల వెనక ఏదో వుందని తెలిసిపోతుంది. ఎంత దమ్మున్నా అస్మదీయులు తస్మదీయులు తేడా వుండకుండా పోతుందా మరి?