తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఏం జరిగింది..?
అక్కడ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత బాధ్యులను గుర్తించారు. నిజంగా అవినీతి జరిగిందని నిర్ధారించుకున్నారు. డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయని తెలుసుకున్నారు. అన్నీ తేలిన తర్వాత కేసులు పెట్టి.. ఆ తర్వాత మీడియాకు సమాచారం. ఓ పద్దతి ప్రకారం.. వ్యవహరించాల్సిన విధానం ఇది.
కానీ ఏపీ ఈఎస్ఐ స్కాంలో లీకులతో మీడియా విచారణ..!
ఆంధ్రప్రదేశ్‌లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను.. ప్రభుత్వానికి సబ్ మిట్ చేసిందో లేదో కూడా తెలియదు. కానీ.. వెంటనే మీడియాకు లీక్ అయిపోయింది. అధికార పార్టీ కి అండగా ఉన్న మీడియాకు ఈ రిపోర్ట్ వెళ్లిపోవడం ఆలస్యం.. తీర్పు చెబుతూ… బ్రేకింగ్స్ వేసేసి.. ఆ తర్వాత విచారణ ప్రారంభించాయి ఆ మీడియా సంస్థలు. అచ్చెన్న ను టార్గెట్ చేస్తూ.. వచ్చిన ఆ కథనాలు .. ఆయనకు నేరుగా శిక్ష విధించినట్లుగా అయింది.
విజిలెన్స్ ఏ ఆధారాలతో… ఆ నివేదిక సమర్పించిందో కానీ.. నిజంగా అలాంటి అవినీతి జరిగి ఉంటే.. ముందుగా చేయాల్సింది.. తదుపరి విచారణ చేయడం. ఆ ఈఎస్ఐ లావాదేవీల్లో ఎలా అవినీతి జరిగింది..? బాధ్యులెవరు..? డబ్బులు ఎంత మేర చేతులు మారాయి..? ఆ డబ్బులు ఎవరెవరికి చేరాయన్నదానిపై కూపీ లాగాలి. ఇదంతా సీక్రెట్ గా జరగాలి. కానీ విజిలెన్స్ రిపోర్ట్ పేరుతో బురద చల్లితే చాలనుకున్నట్లుగా.. ప్రస్తుత రిపోర్ట్ బయటు వచ్చింది. దాన్ని ఓ వర్గం మీడియా హడావుడి ప్రారంభించింది. వీళ్ల హడావుడి చూసి.. అచ్చెన్నాయుడు.. నేరుగా సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎక్కడైనా జరిగినా… అందులో తన ప్రమేయం ఉన్నా… సరే నిరూపించాలన్నారు.
విచిత్రం ఏమిటంటే.. ఈ ఈఎస్ఐ స్కాం రిపోర్ట్ గురించి… కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకు తెలియదు. ఆయన మీడియాలో చూసిన తర్వాతే… ఓ ప్రకటన చేశారు. కార్మికుల్ని గత ప్రభుత్వం దోచుకుందని… ఎవర్నీ వదిలి పెట్టబోమని ఆ ప్రకటన సారాంశం. మొత్తానికి .. నిజంగా స్కాంలు జరిగినా.. జరగకపోయినా.. మీడియాలో మాత్రం… గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై ..బురద చల్లడానికి ఓ మాస్టర్ ప్లాన్‌గా ఈ వ్యవహరం ఉందన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో ఏర్పడిపోయింది.