మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకంటారు..?
అధికారంలో ఉన్న వారికి నిరంతర బాధ్యతను గుర్తు చేస్తూ.. వారు గాడి తప్పుతూంటే.. తప్పుల్ని చెబుతూ.. గుర్తు చేస్తూ.. హెచ్చరిస్తూ.. వెళ్తుంది కాబట్టి.. ప్రజాస్వామ్యానికి మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. జర్నలిజం వ్యాపారవేత్తల చేతుల్లో బందీగా మారిన తర్వాత ఈ ఫోర్త్ ఎస్టేట్‌కు అర్థం మారిపోయింది. అధికారానికి అండగా ఉంటూ.. ప్రతిపక్ష పార్టీలపై విరుచుపడేలా రూపాంతరం చెందింది. ఇందులో.. మెరుగైన చానల్‌గా చెలామణి అవుతున్న చానల్ సరికొత్త సంప్రదాయాలను నెలకొల్పుతోంది.
ప్రభుత్వాల్ని వదిలేసి ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసే మీడియా ఎక్కడైనా ఉంటుందా..?
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. మూడు రోజుల పాటు ఆయనను ఇంట్లోనే ఉంచి సోదాలు చేశారు. ఈ మూడు రోజులు బయట ఏం జరిగిందో రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ.. మూడు రోజుల పాటు.. రేవంత్ రెడ్డి అక్రమాస్తులు వెయ్యి కోట్లు బయటపడ్డాయంటూ.. మెరుగైన చానల్‌తో పాటు మరికొన్ని చానళ్లు ఫేక్ డాక్యుమెంట్స్‌తో ప్రచారం చేశాయి. ఐటీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి విషయం తెలిసి.. ఆ ప్రచారంపై ఆయా మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి అనే కార్యక్రమానికి కౌంటర్‌గా పట్నం గోస అనే కార్యక్రమం చేపట్టగానే.. ఆయనపై పాత భూవివాదం ఒకటి తెరపైకి వచ్చింది. అంతే.. మెరుగైన చానల్ వెంటనే జూలు విదిల్చింది. తీర్పులిచ్చేస్తూ.. బ్రేకింగ్‌లు వేసి.. నానా హంగామా చేసింది. నిజానికి ఇది ప్రైవేటు భూవివాదం. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టు విచారణలో తేలుతుంది. కానీ ఇప్పుడు.. దాన్ని హైలెట్ చేయాలనుకున్నారు కాబట్టి.. చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడేవాళ్లను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కాబట్టి..దానికి మెరుగైన చానల్ టూల్‌గా ఉపయోగపడుతోంది.
ప్రభుత్వాల వైఫల్యాలు వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్లిన మీడియాకు కనిపించవా..?
మెరుగైన చానల్ ఇప్పుడు .. ప్రొఫెషనల్ జర్నలిస్టుల చేతుల్లో లేదు. వ్యాపార వేత్తల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారి వ్యాపార అవసరాలకు తగ్గట్లుగా న్యూస్‌ను బయాస్ చేసి మరీ ప్రజలకు పంపాల్సిన విపత్కర పరిస్థితుల్లో పడిపోయింది. ప్రభుత్వాలపై పోరాడటం సంగతి తర్వాత .. అసలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్కటంటే.. ఒక్క వార్త రాయడం లేదు. గత తొమ్మిది నెలల కాలంలో… ప్రభుత్వాల వైఫల్యాన్ని ఒక్క సారి కూడా ప్రశ్నించలేదు. తెలంగాణలో ఏ ఒక్క పథకం అమలులో లేదు. రైతుబంధు ఇవ్వడం లేదు. ఏపీలో అసైన్డ్ ల్యాండ్స్ ప్రభుత్వం లాగేసుకుంటోంది. అమరావతి రైతుల గోస వినబడటం లేదు. ఏ ఒక్క అంశంలోనూ ఈ మెరుగైన చానల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజల వైపు నిలబడే ప్రయత్నమే చేయడం లేదు.
ఫేక్‌న్యూస్ ప్రచారానికీ వెనుకాడని నైజానికి దిగిపోవడం అవసరమా..?
ప్రభుత్వానికి భయపడో.. తమ యజమానుల ఆర్థిక అవసరాల కోసమో… మెరుగైన చానల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రసారం చేయలేదంటే.. సరే.. వారికి అది బలహీనత అని అనుకోవచ్చు. అంత కంటే దారుణం ఏమిటంటే.. ప్రభుత్వంపై పోరాడే ప్రతిపక్ష పార్టీలపై.. అత్యంత దారుణంగా ఫేక్ న్యూస్‌లు అని తెలిసి కూడా.. సెన్సేషనలైజ్ చేసి.. వారిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయడం..మెరుగైన చానల్ చేస్తోంది. నాడు రేవంత్ రెడ్డి ఇష్యూ కావొచ్చు.. మొన్న చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల గురించి కావొచ్చు.. ఇప్పుడు.. గోపన్ పల్లి భూముల వ్యవహారంలో మెరుగైన చానల్ ఇస్తున్న తీర్పులు కావొచ్చు.. అన్నీ ఆ తరహాలోనే ఉన్నాయి. చివరికి పరిస్థితి ఎలా మారిపోతోందంటే… మెరుగైన చానల్లో ప్రతిపక్ష నేతలపై ఏమైనా నెగెటివ్ కథనాలు వస్తే.. ప్రభుత్వం వారిని టార్గెట్ చేసిందని.. ప్రజలు నమ్మేంతగా పరిస్థితులు మారిపోతున్నాయి.