‘పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం’ అనేది ఒకటి ఉంటుంది! ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశాభావంతో ఉండటం అవసరం. రాజకీయాల్లో ఉన్నవారికి మరీ అవసరం. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రాకు ప్రాధాన్యత దక్కలేదు. ఉప రాష్ట్రపతి స్థానానికి వెళ్లిన వెంకయ్య నాయుడుకు ప్రత్యామ్నాయంగా కంభంపాటి హరిబాబుకు పదవి దక్కుతుందని అనుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. కానీ, చివరి నిమిషంలో సమీకరణలు మారిపోయాయి. ఇదొక్కటే కాదు.. కేంద్రంలోని కొన్ని కీలక శాఖల ఆమాత్యులను మార్చారు కూడా! దీంతో ఏపీకి కొన్ని ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. కానీ, ఏపీలో అధికార పార్టీకి కొమ్ముకాసే ఓ మీడియా వర్గం… కేంద్రమంత్రి విస్తరణ, శాఖల మార్పులను ఏపీ కోణం నుంచీ విశ్లేషించే ప్రయత్నం చేసింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ‘ఢిల్లీ స్థాయి సమర్థత’ కోణం నుంచే ప్రెజెంట్ చేయడం విశేషం!
ఆంధ్రాకు కేంద్రం నుంచి ఇంకా చాలా సాయం అందాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ తోపాటు ఇంకా ఎన్నో రకాలుగా నిధులు రావాల్సి ఉంది. ఒకప్పుడు వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉండేవారు కాబట్టి, ఢిల్లీ ఉంటూ ఆయన మంత్రాంగం నడిపేవారు. ఇతర శాఖల దగ్గరకు ఆయనే పరుగెత్తుకెళ్లి, ఏపీ ప్రయోజనాలపై మాట్లాడేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదే! ఒకవేళ హరిబాబుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. సరే, ఇక శాఖల మార్పు విషయానికొస్తే… కేంద్ర జలవనరుల మంత్రి ఉంటున్న ఉమా భారతి శాఖ మారింది. ఈ శాఖ నితిన్ ఘట్కరీకి వెళ్లింది. అంటే, ఇకపై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులూ వంటివి ఆయన దగ్గరి నుంచే రాబట్టు కోవాలి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉంటూ ఏపీకి బాగానే ప్రాజెక్టులు ఇచ్చారనీ, చంద్రబాబు నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పోలవరం విషయంలో కూడా మనం ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు అనేది సదరు మీడియా వర్గం విశ్లేషణ. రైల్వే మంత్రి సురేష్ ప్రభు శాఖ కూడా మారింది. రైల్వే శాఖ బాధ్యతలు ఇప్పుడు పీయూష్ ఘోయల్ కు ఇచ్చారు. చంద్రబాబు నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు ఆ మీడియా వారు సర్దిచెప్పారు.
సానుకూల దృక్పథంతో ఉండటం మంచిదే. ఇలాంటి కథనాలను తప్పుబట్టడం కూడా ఉద్దేశం కాదు! చంద్రబాబుతో కేంద్ర మంత్రులకు ఉన్న సాన్నిహిత్యాన్ని… రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి ప్రెజెంట్ చేసిన విధానం గురించే ఈ చర్చ. అంటే, కేంద్రమంత్రులతో చంద్రబాబు ఫ్రెండ్లీగా ఉంటేనే ఆయా శాఖల నుంచి ఆంధ్రాకి ప్రయోజనాలు వస్తాయన్నమాట. ఆయన చెబితే తప్ప.. లేదా, ఆయన ప్రయత్నిస్తే తప్ప కేంద్రం నుంచి ఏవీ రావన్నమాట! రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడ్డ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలు ఆయన చేస్తుంటారు, కేంద్రమంత్రిగా దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత వారికీ ఉంటుంది. జలవనరుల శాఖలో ఉమా భారతి ఉన్నా, ఇంకెవరున్నా దేశంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే.
సరే, చంద్రబాబుతో సాన్నిహిత్యమే కాసేపు ముఖ్యం అనుకుందాం. ఏపీ నుంచే రాజ్యసభకు వెళ్లిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇన్నాళ్లూ విశాఖ రైల్వే గురించి ఏం తేల్చలేకపోయారే..? ఆయన్ని ఎందుకు అడగలేకపోయారు..? నిజానికి, ఆయన్ని రాజ్యసభకు పంపుతున్న తరుణంలో… మనకు రైల్వే శాఖపరంగా చాలా మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారే! అయినా, అలాంటివేం జరగలేదు. అంటే, సురేష్ ప్రభుతో చంద్రబాబుకు సాన్నిహిత్యం లేదని అనుకోవాలా..? ఇప్పుడు కొత్తగా పీయూష్ ఘోయల్ పై ఆశలు ఎందుకు పెట్టుకోవాలి..? కేంద్రంలో ఎవరున్నా, శాఖల మంత్రులు ఎవరైనా ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం సాగించాలి. రావాల్సినవి ముక్కుపిండి రాబట్టుకోవాలి. అంతేగానీ, చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కాబట్టే, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతున్నాయనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా..?