ఏపీలో ప్రభుత్వం నుంచి అణచివేతను ఎదుర్కొంటున్న న్యూస్ చానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కాస్త ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు సంబంధించిన ఫైబర్ నెట్లో ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ ట్రిబ్యునల్ .. టీడీశాట్ ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక ఇబ్బందులున్నాయని.. ఇతర కారణాలు చెప్పవద్దని.. రెండు రోజుల్లో ఏబీఎన్ చానల్‌ను పునరుద్ధరించాల్సిందేనని… టీడీ శాట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్‌నెట్‌లో.. వినోద చానళ్ల కన్నా.. వార్తా చానళ్లకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని.. టీడీ శాట్ స్పష్టం చేసింది. కేబుల్ ఆపరేటర్లు.. నిలిపివేయక ముందే.. ప్రభుత్వం ఫైబర్ నెట్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిలిపివేసింది. దీనిపై.. ఏబీఎన్ టీడీశాట్‌లో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన టీడీ శాట్.. చానల్ ప్రసారాలు పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
అధికారికంగా చానల్‌ను.. ఫైబర్ నెట్లో.. ఏపీ సర్కార్ నిలిపి వేసింది. అయితే.. కారణాలు మాత్రం వెల్లడించలేదు. చట్టాల ప్రకారం.. ఒక చానల్‌ను.. ప్రసారం చేయకుండా ఆపేయాలంటే.. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటించిన తర్వాతే.. ఏ చానల్నైనా.. ప్రసారం చేయకుండా నిలుపుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం… అలాంటి నియమ, నిబంధనలు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి చెందినది కాబట్టి ఫైబర్‌నెట్‌లో.. చానల్‌ను నిలిపివేసింది. దానికి సాంకేతిక ఇబ్బందులనీ.. మరో కారణమని.. సమర్థించుకునే ప్రయత్నం చేసింది కానీ.. టీడీశాట్ పడనీయలేదు. దీంతో.. రెండు రోజుల్లో ఏపీ ఫైబర్‌నెట్ లో .. ఏబీఎన్.. ప్రసారమవ్వాల్సి ఉంది. అయితే ఏపీ సర్కార్ తీరు చూసిన వారు మాత్రం… ఏదో కారణం చెప్పడమో.. లేకపోతే.. పట్టించుకోనట్లుగా వ్యవహరించడమో చేస్తారని అంచనా వేస్తున్నారు.
మరో వైపు.. కేబుల్ ఆపరేటర్లకు కూడా.. కేంద్ర నుంచి.. కేంద్ర సమాచార శాఖ నుంచి గట్టి వార్నింగ్ ఇప్పించేలా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. మూడురోజుల కిందట… ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటికి ఓ కేంద్రమంత్రి కూడా వచ్చారు. ఈ సందర్భంలో.. ఏపీలో తాము ఎదుర్కొంటున్న అణచివేత గురించి కూడా చెప్పారంటున్నారు. ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా.. చానల్ నిలిపివేసినట్లుగా తేలితే.. కేబుల్ ఆపరేటర్ల లైసెన్సులు రద్దవుతాయి. ముందుగా.. ఈ అంశంపైనే రాధాకృష్ణ దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.