ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రాజకీయాలు వేడెక్కాయి. మీడియా కూడా ప్రభుత్వ అసమర్థతనీ, అవినీతినీ ఎండగట్టడంలో పదును పెంచుతోంది. ముఖ్యంగా ‘ఈనాడు’ ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై పతాక స్థాయి పోరాటానికి నడుం బిగించింది. ఈమధ్యకాలంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో జగన్ పాలనపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ప్రతీ రోజూ.. ఓ అవినీతి ఉదంతాన్ని పతాక శీర్షికలకు ఎక్కిస్తోంది. తాజాగా ‘జె గ్యాంగ్ భూమంతర్’ పేరుతో ఓ కథనం ప్రచురించింది. వాన్ పిక్ పేరిట 12,731 ఎకరాల భూమిని కేవలం రూ.167 కోట్లకు నిమ్మగడ్డ ప్రసాద్‌కి హస్తగతం చేసిన వైనాన్ని ప్రచురించింది. ఈ భూ దోపిడీలో ఎవరెవరు ఉన్నారో వివరాలతో సహా రాసింది. దీనిపై జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. అవినీతిని ఒప్పుకొన్నట్టే అనుకోవాలి.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళ.. అసలు అంబేద్కర్ ఆశయాలేంటి? జగన్ ప్రభుత్వం చేస్తోందేమిటి? అంటూ సూటిగా ప్రశ్నల వర్షం కురిపించిన కథనం కూడా ఎన్నదగినదే. ఇందుకోసం ‘దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానమిది’ పేరుతో ఈనాడు ఓ పూర్తి పేజీ కేటాయించడం విశేషం. ఈనాడు లాంటి పత్రిక ఓ విషయం కోసం పూర్తి పేజీ కేటాయించడం మామూలు విషయం కాదు. ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పేరు మీదున్న పథకం నుంచి.. అంబేద్కర్ పేరు తీసేసిన ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఎక్కడ ఉందం’టూ.. సూటిగా ప్రశ్నించింది. అంబేద్కర్ విధానాలకూ, జగన్ ప్రభుత్వానికీ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని చాటి చెబుతూ అక్షర బద్ధం చేసిన వ్యాసం కూడా జగన్ ప్రభుత్వానికి చెమటలు పట్టించేదే. మొత్తానికి ‘ఈనాడు’ ప్రజల గొంతుని వినిపించడంలో అన్ని పత్రికల కంటే ముందు వరుసలో ఉంది.