కాదేదీ ప్రచారానికి అనర్హం అని బలంగా నమ్ముతుంది చిత్రసీమ. తెలుగులో అయితే పబ్లిసిటీకి ఏ చిన్న అంశాన్నయినా బలంగా వాడుకోవాలని చూస్తుంటారు. తాజాగా మెకానిక్ రాఖీ చిత్రబృందం కూడా ఓ వినూత్న ఆలోచన చేసింది. మంచి ప్రశ్న అడిగితే బంగారు నాణెం ఇస్తామంటూ మీడియాను ఊరిస్తోంది.
విశ్వక్సేన్ నటించిన సినిమా మెకానిక్ రాఖీ. ఈవారమే విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ఓ ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది చిత్రబృందం. అనంతరం మీడియాతో Q&A సెషన్ కూడా ఉండబోతోంది. ఈ సెషన్లో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ఆ ప్రశ్నల్లోంచి ఉత్తమమైన ప్రశ్నలకు బంగారు నాణెలను బహుమతిగా ఇవ్వబోతోంది. ఈ ప్రెస్ మీట్ కు ‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్ కొట్టు’ అనే పేరు పెట్టింది. దేశంలోనే ఈ తరహా Q&A సెషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం సగర్వంగా ప్రకటించింది. పబ్లిసిటీలో ఇదో కొత్త పంథా అనుకోవొచ్చు. సాధారణంగా ఈమధ్య Q&A సెషన్లు మరీ రొటీన్‌గా సాగుతున్నాయి. అయితే పొగడ్తలు, లేదంటే లేనిపోని ప్రశ్నలతో కాంట్రవర్సీలు. ఇవన్నీ చూసీ చూసీ అందరికీ బోర్ కొట్టేసింది. కొంతమంది స్టార్లు అసలు Q&A ఉంటే తాము ప్రెస్ మీట్లకే రామని చెప్పేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆఫర్ తో ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించడం థ్రిల్లింగ్ గానే ఉంది. కనీసం ఈసారైనా కాస్త మంచి ప్రశ్నలు, ఉత్తమమైన సమాధానాలు వినే అవకాశం కలుగుతుంది.
అన్నట్టు.. ‘మెకానిక్ రాఖీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విశ్వక్సేన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఈవెంట్ తో మెకానిక్ రాఖీ సినిమా కాస్త కాంట్రవర్సీగా మారింది. విశ్వక్ ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ చేస్తుందా, లేదంటే మైనస్‌గా మారుతుందా? అనే ఆసక్తి నెలకొంది. దీనిపై కూడా విశ్వక్ రేపటి ప్రెస్ మీట్ లో స్పందిస్తాడేమో చూడాలి.