ఈనాడు నుంచి శ్రీధర్ వెళ్లిపోయారు. ఇక శ్రీధర్ కార్టూన్ ఈనాడులో కనిపించదు. నిజంగానే శ్రీధర్ అభిమానులకు, ఓరకంగా ఈనాడు అభిమానులకు ఇది చేదు వార్తే. ఇది వరకు తనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదనుకున్న శ్రీధర్ – ఈనాడు ముద్దు బిడ్డ శ్రీధర్.. ఈనాడుని కాదనుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. అయితే శ్రీధర్ లాంటి ప్రతిభావంతుడ్ని, మూలస్థంభాన్ని ఈనాడు ఎలా వదులుకుందో? అనే ఆశ్చర్యం కలగక మానదు. నలభై ఏళ్ల ప్రయాణంలో ఎవరికైనా అలకలు, బుజ్జగింపులు ఉంటాయి. శ్రీధర్ ఈనాడు యాజమాన్యంపై అలిగిన వైనం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చూడలేదన్నది ఈనాడు ఉద్యోగులే చెబుతుంటారు. అలాంటిది సడన్ గా ఇలాంటి నిర్ణయమా?
వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. ఇది కాదనలేని నిజం. ఈనాడు నమ్మే సిద్ధాంతం ఇదే. `ఎంతమంది వెళ్లిపోయినా ఈనాడు పేపర్ ఆగదు కదా?`అనే సూత్రం యాజమాన్యం వల్లిస్తుంటుంది. ఉద్యోగులపైనా ఇదే రుద్దుతుంది. ఎంతటి ప్రతిభావంతుడైనా సరే – `రాజీనామా చేస్తా` అంటే `సరే` అంటుంది ఈనాడు. అది ఈనాడు ముందు నుంచీ అవలంభిస్తున్న వైఖరి. బుజ్జగింపులు, నజరానాలూ జాన్తానై. అలా వెళ్లిపోతా అన్న ప్రతి ఒక్కరినీ ఆపితే.. ఆనక నెత్తికెక్కుతారన్న భయం యాజమాన్యానికి ఉంది. అందుకే.. ఎంతటి ఉద్దండులు వెళ్లిపోయినా ఆపలేదు. ఓ రకంగా.. ఈ వైఖరి చాలా భయంకరమైనది కూడా. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పదే. కానీ.. వ్యక్తుల సమూహమే వ్యవస్థ. ఈ విషయాన్ని ఈనాడు మర్చిపోతోంది. శ్రీధర్ లాంటి వ్యక్తి బయటకు వెళ్లిపోవడం కంటే.. శ్రీధర్ లాంటి వ్యక్తిని ఈనాడు వదులుకోవడం పెద్ద పొరపాటు. శ్రీధర్ లాంటి కార్టూనిస్ట్ ని తయారు చేసుకోవాలంటే.. ఈనాడుకు మరో నలభై ఏళ్లు పడుతుంది.
శ్రీధర్ విరమణ వెనుక… ఈనాడు మొండి వూఖరితో పాటు.. రామోజీ రావు ద్వంద్వ ప్రమాణాలు కూడా ఓ కారణమే. ఈనాడులో ఎవరైనా యాజమాన్యం నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే. ఈనాడులో పనిచేస్తూ.. ఓ కథ రాసుకోకూడదు. వేరే పత్రికలో.. కవిత ప్రచురితం కాకూడదు. మరో ఇతర వ్యాపకాలూ ఉండకూడదు. ఉంటే.. `రాజీనామా` మంత్రమే. వేరే అవార్డులు, రివార్డులూ అందుకోకూడదు. అదీ నిషిద్ధమే. శ్రీధర్ నిష్క్రమణకు ఇదీ ఓ కారణమే. అప్పట్లో శ్రీధర్ పేరు పద్మశ్రీకి పరిగణలోనికి తీసుకొంటే… `పాత్రికేయులు ఇలాంటి అవార్డులు తీసుకోకూడదు` అని శ్రీధర్ని వారించి, పద్మశ్రీకి దూరం చేశారు. అయితే ఆ తరవాతి కాలంలోనే రామోజీ పద్మ వి భూషణ్ దక్కింది. ఈ విషయంలో శ్రీధర్‌కి ఓ న్యాయం.. రామోజీ రావుకి ఓ న్యాయమా?
ఇటీవల శ్రీధర్ ఈనాడులో 40 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. శ్రీధర్ లాంటి వ్యక్తి… ఈనాడు సుదీర్ఘ ప్రయాణంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి.. 40 ఏళ్లు పూర్తి చేసుకుంటే, కచ్చితంగా ఓ వేడుక నిర్వహించడం సబబు. కానీ… ఈనాడు అలాంటి ప్రయత్నాలేం చేయలేదు. సరికదా.. ఆ రోజున శ్రీధర్ ఇంట్లో వాళ్లూ, సన్నిహితులు చేసిన హంగామాతో యాజమాన్యం కళ్లు ఎర్ర బడ్డాయి. అదే రోజున శ్రీధర్ కొత్త కారు కొనుక్కోవడం, అది బహుమతిగా ఇచ్చారన్న ప్రచారం జరగడం తో…. యాజమాన్యం శ్రీధర్‌పై కన్నెర్ర చేసింది. ఫలితమే.. ఈనాడు శ్రీధర్ రాజీనామా.
మొత్తానికి శ్రీధర్ నిష్క్రమణతో ఈనాడులో ఎవరి ఉద్యోగం గ్యారెంటీ కాదన్న నిజం మరోసారి నిరూపితమైంది. ఓ మర్రిచెట్టు పక్కకున్న చిన్న చిన్న వృక్షాలు ఎదగవు. ఆ మర్రి చెట్టు ఎదగనివ్వదు. కానీ.. తన వేళ్లనే తాను నరుక్కోవడం ఓ అమాయక చర్య. శ్రీధర్ విషయంలోనూ ఈనాడు అదే చేసింది.