టీవీ 9 రేటింగ్‌లు దారుణంగా పడిపోయాయి. తెలుగులో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అదే సమయంలో ఎన్టీవీకి టీవీ9 కి మధ్య రేటింగుల్లో చాలా తేడా ఉంది. రేటింగ్‌లు మ్యానిపులేట్ చేస్తున్నారని అనుకుని టీవీ9 సరిపుచ్చుకోలేకపోతోంది. ఎందుకంటే ఆ ఆటలో టీవీ9 కూడా తక్కువేమీ తినలేదు. అందుకే ఎలాగైనా సరే మళ్లీ టాప్ రేటింగ్‌లు తెచ్చుకోవాలని పరిశోధన చేసి మరీ ఓ కన్సల్టెంట్‌ను నియమించింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఘనంగా ఉంది. నెలకు కనీసం రూ. ఓ పది లక్షలైనా సమర్పించుకోకపోతే ఆయన సేవలు అందడం కష్టమే.
టీవీ9 కొత్త కన్సల్టెంట్ పేరు రాజుల్ కులశ్రేష్ట. ఆయన మొదటి నుంచి మీడియా రంగంలో లేరు. ఆయనకంటూ సొంత సంస్థలు ఉన్నాయి. మీడియా, మీడియా ఎజెన్సీల్లో చాలా కాలం పని చేశారు. అలాగే నెస్లె, రెకిట్, జీఎం, కోకోకోలా వంటి బ్రాండ్లతో కలిసి పని చేశారు. విదేశాల్లోనూ విధులు నిర్వహించిన తర్వాత ఇండియాకు వచ్చి సొంత మీడియా ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. కానీ మీడియా ఏజెన్సీ ద్వారా జియోనీ , కార్ దేఖో, మోబిక్విక్, యూబీ బ్రౌజర్, షాప్ క్లూస్ వంటి వాటిని లాంచ్ చేశారు. ప్రస్తుతం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కూడా కులశ్రేష్ట క్లయింట్లలో ఒకరని చెబుతారు.
ప్రస్తుతం ఈ రాజుల్ కులశ్రేష్టను టీవీ9 కన్సల్టెంట్‌గా పెట్టుకుంది. ఆదాయం పెంచుకోవడానికా.. బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికా.. రేటింగ్ పెంచుకోవడానికా అన్న విషయం పక్కన పెడితే.. అన్ని విషయాల్లోనూ ఆయన సలహాలు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఒక్క తెలుగే కాకుండా అన్ని చానళ్లు తిరోగమనంలో ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఒక్క రవిప్రకాష్ లేకపోవడం వల్ల టీవీ9 గ్రూప్‌కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.