డిజిటల్ మీడియాలో తనకంటూ ఓ మార్క్ సృష్టించుకొంది మ్యాంగో. ఈ సంస్థ టర్న్ఓవర్ కోట్లలో ఉంటుంది. అధినేత మ్యాంగో రామ్ కి చిత్రసీమలో మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా సినిమాలకు, సెలబ్రెటీలకు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్లు చేస్తుంటోంది మ్యాంగో. ఈ సంస్థలో వందలాది ఉద్యోగులు ఉన్నారు. అయితే… ఇటీవల మ్యాంగోలో రెండు కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగింది. సంస్థలో విశ్వాస పాత్రుడిగా పని చేస్తున్న ఓ ఉద్యోగి.. తిన్న ఇంటి వాచాలు లెక్క పెట్టే ప్రయత్నం చేశాడు. డిజిటల్ ప్రమోషన్ల నిమిత్తం నిర్మాతలు ఇచ్చిన చెక్ని తన సొంత ఖాతాకు మళ్లించడం ద్వారా దాదాపుగా రెండు కోట్లు వెనకేశాడు. ఈ డబ్బుతో ఓ కారు, ఫ్లాటూ కొనుగోలు చేసినట్టు భోగట్టా. మోసం ఎన్నాళ్లో దాగదు కదా..? ఈ విషయం మెల్లగా వెలుగులోకి వచ్చేసింది. దాంతో సదరు ఉద్యోగిని సంస్థ నుంచి తీసేశారు. యాజమాన్యం కూడా ఉద్యోగిపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తోంది. మోసం రెండు కోట్లకే పరిమితమా? ఇంకా ఈ ముసుగులో ఇలాంటి మోసాలేమైనా జరిగాయా? అనే విషయంపైనా మ్యాంగో సంస్థ ఆరా తీస్తోంది.