ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ఏపీ సర్కార్ పంపిన ఓ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేశారు. ఆ ఆర్డినెన్స్ పేరు ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ఆర్డినెన్సు 2020. ఈ పేరును చూసి ఇక ఏపీలో వైద్య రంగంలో చదువులు.. రీసెర్చ్ కోసం కార్పొరేషన్ పెట్టేశారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇలాంటి కార్పొరేషన్ పెట్టడానికి ఏపీకి ఉన్న మౌలిక వసతులేంటి..? ఎలాంటి పరిశోధనలు చేస్తుంది..?. వందలు…వేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలు… ఇరవై నాలుగు గంటలూ శ్రమించే సైంటిస్టులతో పడే కుస్తీని ఏపీ సర్కార్ ఈ కార్పొరేషన్ ద్వారా ఎలా పడుతుందనే చర్చ ఉన్నత విద్యా రంగంలో ఉంది.
అయితే.. ప్రభుత్వం ముందుగా వాటి గురించి ఆలోచించలేదు. ప్రభుత్వ ఫస్ట్ ప్రయారిటీ అప్పులు చేయడం. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ద్వారా దాదాపుగా రూ. పదహారు వేల కోట్ల అప్పులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డబ్బులతో మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి చొప్పున పెడతామని.. వైద్య రంగంలో పరిశోధనలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే వివిధ రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలను తీసుకుని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మళ్లించింది.
ఇటీవలే ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. పాతిక వేల కోట్లు రుణం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. మెడికల్ కార్పొరేషన్ కూడా తెర పైకి వచ్చింది. అప్పులు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో కానీ.. వచ్చే నిధులు మెడికల్ కాలేజీలకు… రీసెర్చ్లకు కన్నా… సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయి.