వారం రోజుల వ్యవధిలో తెలుగురాష్ట్రాల్లో నలుగురు వైద్య విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఆత్మహత్యలోనూ ఆర్ధాకాంశంలేదు. భరించలేని వత్తిడి మూలంగా చనిపోయిన ఈ పిల్లలు ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల వారే!
ప్రతిభతో ఫ్రీసీట్ తెచ్చుకుని సమర్ధుడైన న్యూరో సర్జన్ గా ఎదిగి పేరు ప్రఖ్యాతులతోపాటు ఎడా పెడా సంపాదిస్తున్న ఒక న్యూరో సర్జన్ కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నవారిలో వున్నాడు. ఆ అబ్బాయి తల్లి కూడా డాక్టరే! చనిపోయిన కుర్రవాడి ముందు తండ్రే ఒక బెంచ్ మార్క్ అయ్యారు. ఆయన్ని మించిపోవాలన్న తల్లిదండ్రుల నిరంతర వత్తిడే ఈ బలవన్మరణానికి మూలమని ఇపుడు కుటుంబ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
మరో కేసులో తండ్రి పేదరికం నుంచి రియల్ ఎస్టేటు వ్యాపారంలో కోట్లు గడించిన వ్యక్తి. సమాజంలో తనకి దొరకని గౌరవ మర్యాదలు వైద్య వృత్తిలో ప్రవేశపెడితే తన కొడుక్కి దొరుకుతాయని అతన్ని ఎంబిబిఎస్ లో చేర్పించారు.
కనీసం డాక్టర్ అయినా కాకపోతే తమ కూతురు మంచి వైద్య కుటుంబంలో కోడలు కాలేదన్న ఆలోచనతో ఒక మధ్య తరగతి కుటుంబం తమ కుమార్తెను మెడిసిన్ లో జాయిన్ చేశారు.
సొంత పేషన్ వల్ల కాక, పేరెంట్స్ ముందుకి నేట్టడం వల్లే మెడిసిన్ లో చేరి చదువులో కష్టాన్ని, కన్నవారి వత్తిడిని తట్టుకోలేక ఇలా అపుడపుడూ చనిపోతున్నవారికంటే మెడికల్ కాలేజీల్లో, హాస్టళ్ళలో మానసికంగా నరకం చూస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది.
ప్రతిభతో సీట్లు తెచ్చుకునే ఎ కేటగిరీలో ఈ సమస్య దాదాపు లేదు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ పద్ధతిలో మేనేజిమెంటు కోటాలో, ఎన్ఆర్ఐ కోటాలో కోటి రూపాయలకు పైగా వెచ్చించి సీట్లు తెచ్చుకున్న మెడికోల విషయంలోనే ఈ సమస్య హెచ్చుగా వుంది. ఈ కేటగిరిలో అడ్మిట్ చేయించే తల్లిదండ్రులకు ముందుగా కౌన్సెలింగ్ చేయించడం ద్వారా, అలాంటి మెడికోలకు అవసరమైనపుడు కౌన్సెలింగ్ చేయించడంద్వారా ఈ సమస్యను కొంత పరిష్కరించుకోవచ్చు! అయితే, ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలన్నదే ప్రశ్న!!
ఎదిగొస్తున్న పిల్లల బలవంతపు చావు ఆకుటుంబానికి ఎన్నటికీ తీరని శోకమే! అదే సమయంలో అసలే కొరతగా వున్న మెడికల్ సీట్లలో ఏటా నాలుగైదైనా ఇలా వృధా పోవడం సమాజానికీ పూడని నష్టమే!