కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. డిజైన్ లోపాలా.. నిర్మాణ లోపాలా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ వార్త జాతీయ మీడియాలో సైతం హెడ్ లైన్స్ అయింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు మాత్రమే కాదు.. ఆ ప్రాజెక్టు కోసం తెలంగాణ సర్కార్ చేసిన ప్రచారం కూడా ఓ కారణం. మానవ నిర్మిత మహాద్భుతం కట్టామని వందల కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంది. ఇప్పుడా ప్రాజెక్టులో కీలక భాగం కుంగిపోయింది. అందుకే జాతీయ మీడియా కూడా కవరేజీ ఇస్తోంది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక చానల్ మాత్రం.. అసలు మేడిగడ్డలో ఏమీ జరగలేదు.. మేము చూడలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ చానల్ టీవీ9. రెండు రోజుల మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దుమారం రేగుతోంది. కానీ చిన్న వార్త కూడా కవర్ చేయడం లేదు టీవీ9. అదే .. ఏపీ సెక్రటేరియట్ లో వర్షం వచ్చింది..కాసిని నీళ్లు కిందకు జారాయంటే.. మూడు రోజుల పాటు కథలు కథలుగా ప్రచారాలు చేస్తుంది. చేసింది కూడా. మరి ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు కనిపించడం లేదు ?
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడితే.. కనీస సమాచారం ప్రజలకు చెప్పరా ? . ఏం జరిగిందో తమదైన బ్రేకింగ్లతో విశ్లేషించరా ?. అసలు ఆ కాంట్రాక్టర్ గురించి మాట్లాడరా.. ?. ఇటీవల ఓ వివాదంలో తాము .. తమ జర్నలిజం ప్రమాణాల గురించి.. ఘనత వహించిన టీవీ9 ఎడిటోరియల్ విభాగంగా పెద్ద పెద్ద నీతులు చెప్పారు . ఇప్పుడేమయ్యాయి అవన్నీ .
రాజకీయ నేతలు… వాళ్లని ఆడిస్తున్న కాంట్రక్టర్ల చేతుల్లోకి వెళ్లిన టీవీ9 సెలక్టివ్ వార్తలను ప్రసారం చేస్తూ.. తాము అమ్ముడుపోయిన మీడియా అని.. తమను ప్రజలు నమ్మవద్దని పదే పదే ప్రకటించుకుంటోంది. ఇప్పటికీ చాలా సార్లు ఇలా తమ పాక్షికతను ప్రదర్శించింది. ఇప్పుడు కూడా ప్రదర్శిస్తోంది. ప్రేక్షకుల్లో.. .వేగంగా ప్రభావం కోల్పోతున్న టీవీ9 ఇలాంటి వాటితో.. మరింత దిగజారడానికి రెడీ అయిపోయిందని అనుకోవచ్చు.