‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి శ్రీలీల వచ్చింది. శ్రీలీల ప్లేసేమో మీనాక్షి చౌదరికి దక్కింది. అలా.. మహేష్ సినిమాలో నటించే అపురూపమైన అవకాశం అందుకొంది మీనాక్షి చౌదరి. అయితే… ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రోమోల్లో, టీజర్ లో మీనాక్షి చౌదరి అలికిడే లేదు. కనీసం పాట, పోస్టర్లో కూడా ఆమెను చూపించలేదు. దాంతో అసలింతకీ మీనాక్షి చౌదరి ఉందా, లేదా? అనే అనుమానాలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు ఆమెను చిత్రబృందం పరిచయం చేసింది. రాజీ పాత్రలో మీనాక్షిని ఇంట్రడ్యూస్ చేస్తూ… టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
పరికిణీ ఓణీలో పద్ధతిగా కనిపించింది మీనాక్షి. ఆమెకు ఈ టైపు గెటప్ పూర్తిగా కొత్త. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ, పైగా సంక్రాంతికి వస్తోంది, ఇంత పెద్ద సినిమాలో.. చిన్న పాత్ర చేసినా మంచి గుర్తింపు వస్తుంది. అందుకే మీనాక్షి ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చు. కాకపోతే.. త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్లకు అంతగా గుర్తింపు రాదు. ‘అత్తారింటికి దారేది’లో ప్రణీత, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈషా రెబ్బలకు ఏమాత్రం ఫేమ్ దక్కలేదు. మరి.. మీనాక్షి సంగతేమిటో? ఈనెల 12న ‘గుంటూరు కారం’ విడుదలకు సిద్ధమైంది. 11 నుంచే ప్రీమియర్లు పడిపోతున్నాయి. 6న ట్రైలర్ విడుదల చేస్తారు.