తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పదవుల పంపకం కోసం కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించి వివరాలు ఇవ్వాలని కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూపుగా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు రెండో గ్రూపుగా.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూపుగా విభజించాలని నిర్ణయించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొదటి ప్రాధాన్యతగా సహజంగానే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి దక్కుతుంది. రెండో ప్రాధాన్యత ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన వాళ్లకు లభిస్తుంది.
అయితే ఏ ఎన్నికలు .. అసెంబ్లీ ఎన్నికలా.. పార్లమెంట్ ఎన్నికలా అన్నది మీనాక్షి నటరాజన్ డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పటికి ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వందల కొద్ది నామినేటెడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పార్టీ అధికారమలోకి వచ్చినా చిన్న పదవి కూడా దక్కించుకోలేకపోతున్నామన్న ఆవేదనలో చాలా మంది ఉన్నారు. ఈ లోపు పార్టీ అధికారంలోకి వచ్చిందని వరుస పెట్టి వలసలు వచ్చేసిన వారు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పోటీ పడి తాము పదవులు సాధించుకోలేలేమేమో అని కొంత మంది మథనపడుతున్నారు.
మరో వైపు పార్టీలో ఎప్పుడు చేరామన్నది కాదని.. తము పార్టీని గెలిపించామా లేదా అన్నది చూడాలని అంటున్నారు. రేవంత్ రెడ్డి పదేళ్ల ముందరే పార్టీలో చేరి ఉండవచ్చు కానీ ఈ రోజు ఆయన పార్టీని గెలిపించి చీఫ్ మినిస్టర్ పోస్టులో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే రేవంత్ తో పాటు వచ్చిన చాలా మందికి అవకాశాలు దక్కడం లేదు కానీ పార్టీ విజయం కోసం పని చేశారు. ఇలాంటి వారంతా తమను గుర్తించాలని కోరుతున్నారు. పదవుల కోసం వచ్చి పార్టీలో చేరిన వారిని నిస్సంకోచంగా పక్కన పెట్టవచ్చని.. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చినా పార్టీ కోసం నిఖార్సుగా పని చేసిన వారిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు.
తెలంగాణ రాజకీయ నేతల్ని డీల్ చేయడం మీనాక్షి నటరాజన్ కైనా అంత తేలిక కాదు. ఆమే పదవుల పంపకంలో అందర్నీ క్రమశిక్షణలో ఉంచుతారో లేదో చెప్పడం కష్టం.