కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. కామన్. దానికి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. తమ పార్టీలో మాట్లాడే స్వేచ్చ ఉంటుందని చెప్పి వారంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. పార్టీ ఇంచార్జులపై మండిపడుతూ ఉంటారు. తమకు పదవులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూస్తారంటూ హెచ్చరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అంతర్గత ప్రజాస్వామ్యానికి కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
తీన్మార్ మల్లన్న వ్యవహారం కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నలుగుతోంది. ఆయన ఎమ్మెల్సీ కావడంతో ఉన్న పళంగా సస్పెండ్ చేయలేరు. హైకమాండ్ నిర్ణయం మేరకే.. సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. హైకమాండ్.. పార్టీ కొత్త ఇంచార్జ్ కు ఆ బాధ్యతలు ఇచ్చింది. ఆమె వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేసేసి ఓ సంకేతం పంపారు. మిగతా వారికి కూడా ఇంతకు ముందులా పరిస్థితి ఉండదని.. ఎవరైనా ఆరోపణలతో రచ్చకెక్కితే పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరికలు పంపారు.
పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా ఎవరైనా పని చేయాల్సిందేనని వ్యక్తిగత పదవుల కోసం ఎవరైనా సమస్యలు సృష్టిస్తే మాత్రం.. సహించేది లేదంటున్నారు. మంత్రి పదవుల కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచి రెడ్డి కిషన్ రెడ్డి వంటి వారికి ఇవి ఓ రకంగా హెచ్చరికలే అనుకోవచ్చు. పార్టీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తే అది ..తమను పార్టీ కాదనలేదన్న ఉద్దేశంతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. ఇలాంటి వారికి మీనాక్షి నటరాజన్ చెక్ పెట్టినట్లేనని అంచనా వేస్తున్నారు.