పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో కలిసి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ గూడుపుఠాణి చేశారంటూ ఓ వర్గం మీడియాలో సీసీ ఫుటేజీ చూపిస్తూ చేస్తున్న ప్రచారంపై.. బీజేపీ ఎంపీ మండిపడ్డారు. పార్క్ హయత్‌లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తన కార్యాలయం ఉందని ..తనను ఎవరు కలవాలన్నా..అక్కడకే వస్తూంటారని.. అందులో రహస్యం ఏముందని ప్రశ్నించారు. లాక్ డౌన్ తరువాత అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నానని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తన కార్యాలయంలో తాను ఇతరులను కలిస్తే.. రహస్యం ఎందుకవుతుందని ప్రశ్నించారు.
ఈ నెల 13న కామినేని శ్రీనివాస్ కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారుని.. అదే రోజు రమేష్ కుమార్ కూడా నన్ను కలవాలని అడిగారన్నారు. వారిద్దరు వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యారన్నారు. కామినేని పార్టీ పరమైన అంశాలపై చర్చిస్తే… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుటుంబపరమైన అంశాలపై చర్చించారన్నారు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదని సుజనా స్పష్టం చేశారు.
అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సిసి ఫుటేజ్ చూపించి మేము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని చెబుతున్నారని.. ఇలాంటి విషయాలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టేనని స్పష్టం చేశారు. తానెప్పుడూ ఓపెన్‌గా ఉంటానన్నారు. రహస్య రాజకీయాలు చేయాల్సిన అవసరం అసలే లేదని తేల్చి చెప్పారు.