ఈనెల 23న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలతో జరగాల్సిన హోం మంత్రిత్వ శాఖ సమావేశం వాయిదా పడటం విశేషం! ఓపక్క ఆంధ్రాలో కేంద్రం తీరుపై ఆందోళన వ్యక్తమౌతున్న తరుణంలో ఈ సమావేశం ఉంటుందని కేంద్రం పిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీకి సంబంధించి అంశాలపై కొంత స్పష్టత వస్తుందని అందరూ ఆశించారు. అంతేకాదు, దాని కోసమే రాష్ట్ర క్యాబినెట్ భేటీని కూడా ఒక రోజు ముందుకు జరిపారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, ఆంధ్రా తరఫున వెళ్లబోతున్న ఉన్నతాధికారుల బృందంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ప్రస్థావించాల్సిన అంశాలపై కూడా కొంత కసరత్తు చేశారు. అయితే, ఇంత జరిగాక ఈ నెల 23న జరగాల్సిన సమావేశం వాయిదా పడటం గమనార్హం. మళ్లీ ఎప్పుడు పెడతారన్న సమాచారం కూడా లేదు! పార్లమెంటు సమావేశాలు అయ్యాక.. అంటే ఏప్రిల్ నెలలో ఉంటే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
నిజానికి, ఈ కీలక భేటీకి ఆంధ్రాతోపాటు తెలంగాణ కూడా హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే, కొన్ని ఆస్తుల పంపకాలపై కూడా చర్చించాలని హోంశాఖ భావించింది. దీంతోపాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలపై కూడా చర్చ ఉంటుందని ఏపీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ సమావేశానికి తాము ఇప్పుడు హాజరు కాలేమని తెలంగాణ సర్కారు తేల్చి చెప్పడం, ఈ సమయంలో తమకు వేరే పనులున్నాయని విశేషం. దీంతో ఆంధ్రాకు సంబంధించి అత్యంత కీలకం అనుకున్న ఈ సమావేశం నిరవదికంగా వాయిదా పడిపోయింది. రైల్వే అధికారులను కూడా ఢిల్లీకి పిలిచారు కాబట్టి, ఈ సమావేశం తరువాత రైల్వే జోన్ పై స్పష్టత వస్తుందనీ అనుకుంటే… తెలంగాణ సర్కారు తీరుతో సమావేశం ఆగిపోయింది. ఇలాంటి సమావేశం మళ్లీ జరగాలంటే రెండు రాష్ట్రాల అంగీకారాన్ని మరోసారి కేంద్రం కోరాల్సి ఉంటుంది. ఆంధ్రా రెడీగానే ఉంటుందికానీ, తెలంగాణ మళ్లీ అంగీకరించాలి.
అయితే, ఇప్పుడు జరగాల్సిన ఈ సమావేశాన్ని పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్రం నిర్వహిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే, కేంద్రంపై ఆంధ్రాలో మరింతగా ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితి రావొచ్చు. కానీ, ఏపీలోని దాదాపు అన్ని పార్టీల నుంచీ పెరుగుతున్న ఒత్తిడి తీవ్రతను కేంద్రం ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదనే చెప్పాలి. ఆంధ్రా సమస్యలపైగానీ, విభజన అంశాలపై కానీ వీలైనంత త్వరగా దిద్దుబాటు చేద్దాం అనే ధోరణి ఇప్పటికీ కనిపించడం లేదు. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ సమావేశాన్ని నిరవదికంగా వాయిదా వేయడం అంటే పుండుమీద కారం చల్లినట్టే అవుతుందనడంలో సందేహం లేదు.