చంద్రబాబు అంటేనే తెలంగాణకు వ్యతిరేకి అన్నట్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టారు. తెలంగాణలో బలమైన టీడీపీ పునాదులపై బీఆర్ఎస్ ను నిర్మించుకున్నారు. స్ట్రాంగ్ లీడర్స్ ను పార్టీలో చేర్చుకోవటం, తెలంగాణ-ఆంధ్రా సెంటిమెంట్ తో క్యాడర్ ను దగ్గర తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన ఏడాది ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటిందంటేనే పునాదులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో అసలు పోటీకే చంద్రబాబు ఆసక్తి చూపలేదు. రాజకీయ పార్టీగా గెలుపోటములు అటుంచితే పోటీ అనివార్యం. కానీ, చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం… రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులంతా టీడీపీ ఆఫీసులకు వెళ్లి మరీ మేం మీ వాళ్లమే అని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో బాబు అధికారంలోకి రావటం… తెలంగాణలోనూ పూర్వవైభవం కోసం పనిచేద్ధామని చంద్రబాబు పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
గతంలో టీడీపీలో ఉండి బీఆర్ఎస్ లో చేరిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు సహా చాలా మంది లీడర్లు బాబును కలిశారు.
నిజానికి కొంతకాలంగా టీడీపీ తెలంగాణలో యాక్టివ్ కాబోతుందని… మాజీ మంత్రి మల్లారెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. చంద్రబాబు వ్యాఖ్యలు, ప్రచారంతో పాటు లీడర్లంతా బాబును కలవటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం కాబోతుంది. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ భాగం గ్రేటర్ నుండి ఉండటం… గతంలో వారికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో… తెలంగాణలో టీడీపీ గేర్ మార్చబోతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.