ఆగస్టు 22… చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రతీ యేడాది.. శిల్పారామంలో చిరు అభిమానులతో ఓ పెద్ద వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఈ వేడుకని ఇంకాస్త భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించారు. ‘మెగా కార్నివాల్’ పేరుతో హైదరాబాద్ లోని హైటెక్స్‌లో ‘చిరు ఫిల్మ్ ఫెస్టివల్’ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెస్టివల్ లో చిరు సినిమాల్ని ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి చిరు అభిమానుల్ని ఆహ్వానిస్తున్నారు. అంతే కాదు… మెగా హీరోలంతా ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఒకొక్కరూ ఒక్కో సెషన్లో అతిథులుగా వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
”ఇప్పటి వరకూ ఏ హీరోకీ ఈ స్థాయిలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేయలేదు అనిపించుకొనేలా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తాం. మెగా అభిమానులకు ఇదో పండగ. ఈ ఈవెంట్లో మెగా హీరోలంతా వస్తారు. నేనైతే అన్నయ్య గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని విషయాలు చెప్పాలనుకొంటున్నా” అని నాగబాబు ఊరిస్తున్నారు. చిరు కాస్ట్యూమ్స్, చిరు వాడిన ప్రోపర్టీస్ ఇవన్నీ ఈ కార్నివాల్లో ప్రదర్శించాలన్నది ఓ ప్లాన్.