అల్లు అర్జున్ వ్యవహార శైలి మెగా అభిమానులకు నచ్చడం లేదనేది ఓపెన్ సీక్రెట్. మొదటి నుంచి బన్నీ తీరుపై సంతృప్తిగానే వున్నారు మెగా ఫ్యాన్స్. ఎన్నికల సమయంలో బన్నీ చేసిన నంద్యాల పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఇక పుష్ప 2 విడుదలకు ముందు బన్నీ చేసిన ప్రమోషన్స్ లో ఎక్కడ కూడా ‘మెగా’ ప్రస్తావన రాకుండా చూడటం మెగా ఫ్యాన్స్ కి ఇంకా ఆగ్రహం తెప్పించింది.
ఇలాంటి నేపధ్యంలో పుష్ప 2 సినిమాపై మెగా ఫ్యాన్స్ అప్రకటిత బ్యాన్ విధించారనే మాట వినిపిస్తోంది. కొన్ని మెగా అభిమాన సంఘాలు సమావేశమై పుష్ప2 సినిమాకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నిజానికి ఈ ఎఫెక్ట్ ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కనిపించింది. అక్కడ ప్రిమియర్స్ కి చాలా వరకూ థియేటర్స్ ఫుల్ కాలేదు. అడ్వాన్స్ బూకింగ్స్ జరగకపోవడం చాలా చోట్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారనేది వాస్తవం.
దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. టికెట్ రేటు సామాన్యుడు కొనేలా లేదు. ఎనిమిది వందలు పెట్టి టికెట్ కొనుక్కునే స్థోమత అందరికీ వుండదు. మరో ప్రధాన కారణం.. మెగా అభిమాన సంఘాలు కలసికట్టుగా తీసుకున్న నిర్ణయం కూడా దినిపై ప్రభావం చూపడటం.
తెలంగాణలో పుష్ప2 ప్రిమియర్లు ఓ ఊపు ఊపాయి. అన్ని సెంటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. నిర్మాతలు హ్యాపీ. కానీ ఈ ఊపు ఉభయ గోదావరి జిల్లాలో కనిపించలేదు. ముఖ్యంగా బీ, సి సెంటర్లలో చాలా చోట్ల ప్రిమియర్స్ జరగలేదు. టికెట్స్ రేట్స్ కారణంగా షోలు క్యాన్సిల్ అయ్యాయని అనుకున్నప్పటికీ, తాము విధించిన అప్రకటిత బ్యాన్ దీనికి అసలు కారణమని కొందరి మెగా ఫ్యాన్స్ వెర్షన్.
దీంతో పాటు సినిమాలో ‘బాసు.. ‘ డైలాగ్ ఇంకా మంటపుట్టించింది. ఈ డైలాగ్ ని వ్యతిరేక మీడియా తమకి అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలో పుష్ప2 వసూళ్లుపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.