నియంత్రణ అనుకోవచ్చు.. నిషేధం అనుకోవచ్చు.. మరొకటి అనుకోవచ్చు… ఎవరు ఏమనుకున్నా మెగా ఫ్యామిలీ మాటే నెగ్గింది. టీ కప్పులో తుఫాను మాత్రమే అనుకున్న శ్రీరెడ్డి వివాదం చివరకి సునామీలా ఎలా మారిందో తెలుగు ప్రజలందరూ చూశారు. పవన్‌కల్యాణ్‌ని తిట్టమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది తానేనంటూ రామ్‌గోపాల్ వర్మ చెప్పడం, తరవాత టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా ఛానళ్లు తనపై కుట్ర చేశాయని.. వాటిని బాయ్‌కాట్ చేయమని ఆయన పిలుపు ఇవ్వడం తెలిసిన విషయాలే. తరవాత ఫిల్మ్ ఛాంబర్లో పవన్ నిలదీతతో పరిణామాలు వేగంగా మారాయి. మెగా ఫ్యామిలీ ఒక్క తాటిపైకి వచ్చింది. అక్కణ్ణుంచి వివాదం కొత్త మలుపు తీసుకుంది. మెగా ఫ్యామిలీ మొండిపట్టు పట్టడం, దానికి మెజార్టీ సినిమా ప్రముఖులు వత్తాసు పలకడంతో మీడియాపై తెలుగు సినిమా ఇండస్ట్రీ నిషేధం విధించాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి ఆలోచన ఏమీ లేదని తాజా ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా చెప్పారు. కానీ, చివరికి జరిగింది మాత్రం మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా పవన్ కల్యాణ్ కోరుకున్నదే.
మీడియాపై మెగా నియంత్రణ మొదలైంది. మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ టీమ్ ఇంటర్వ్యూ టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా ఛానళ్లకు ఇవ్వలేదు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశారు. పవన్ బాయ్‌కాట్ చేయమని పిలుపు ఇచ్చిన నాలుగు ఛానళ్లకు తప్ప మిగతా అన్ని ఛానళ్లకు ఆ ఇంటర్వ్యూ పంపారు. బుధవారం ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణకు తీసుకుంటున్న, తీసుకోబోయే చర్యలు వివరించడానికి ఇటీవల అధికార ప్రతినిధులుగా నియమింపబడిన సభ్యుల్లో కొంతమంది ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అందులో ఇదే విషయమై ఫిల్మ్ ఛాంబర్
ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ‘జెమిని’ కిరణ్‌ని ప్రశ్నించగా… “తమ కంటెంట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిర్మాతల ఇష్టమనీ, రెండు మూడు ఛానళ్లకు ప్రకటనలు ఇచ్చి మిగతా ఛానళ్లకు ఇవ్వనప్పుడు ఈ విధంగా ఎందుకు అడగలేదని” ఎదురు ప్రశ్నించారు.
మెగా ఫ్యామిలీ కోసం ఇండస్ట్రీ ఇదంతా చేస్తుందా? అని అడిగితే.. “మెగా ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మెగా ఫ్యామిలీ” అని కిరణ్ ఘాటుగా, ఒకింత ఆవేశంగా ఆన్సర్ ఇచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “రీసెంట్గా జరిగిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహానటి సినిమా ఈవెంట్స్ అన్ని ఛానళ్లకు లైవ్ ఇచ్చారు” అని గుర్తు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు మీటింగుల్లో ఏం మాట్లాడుకున్నారని మీడియా ఎన్ని విధాలుగా ప్రశ్నించినా కిరణ్ సమాధానాలు చెప్పలేదు. చెప్పాల్సిన సమయంలో చెబుతామన్నారు. దీంతో ఒక్కటి స్పష్టమైంది. మీడియా మీద మెగా ఫ్యామిలీ మాట చెల్లుబాటు అయ్యింది. ఈ నియంత్రణ వెనుక మిగతా ఫ్యామిలీలు కూడా ఉండొచ్చు. అయితే.. పవన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఎక్కువ ప్రాజెక్ట్ అవుతోంది. ఒక్క ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలకు మాత్రమే ఈ నియంత్రణ పరిమితం అవుతుందా? తరవాత రాబోయే ‘మెహబూబా’, ‘మహానటి’ సినిమాలు కూడా ఇదే బాట అనుసరిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ ప్రెస్మీట్స్ అన్ని చానళ్లకు ఇచ్చి, స్పెషల్ ఇంటర్వ్యూల విషయంలో నాలుగు ఛానళ్లను పక్కన పెట్టాలనేది ఇండస్ట్రీ నిర్ణయంగా కనిపిస్తోంది.