హీరో ప్రభాస్ మిత్రులు వంశీ, ప్రమోద్ కలిసి ఏర్పాటు చేసిన యూ.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తమ మొట్టమొదటి సినిమా ‘మిర్చి’ తో తొలివిజయం అందుకొంది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా 2013 సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత యూవీ క్రియేషన్స్ సంస్థ 2014లో శర్వానంద్, సీరత్ కపూర్ లతో ‘రన్ రాజా రన్’ అనే సినిమా తీసింది. అది కూడా బాగానే వసూళ్లు రాబట్టుకొంది. మళ్ళీ వెంటనే గోపీ చంద్, రాశి ఖన్నాలతో ‘జిల్’ అనే సినిమా తీసారు. ఆ తరువాత నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వానంద్, సురభి జంటగా నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మా టీవీ ఛానల్ రూ.3.25 కోట్లు చెల్లించి ఆ సినిమా శాటిలైట్ హక్కులను కొనుకోవడం గమనిస్తే ఆ సినిమాపై ఎంత భారీ అంచనాలున్నాయో అర్ధం చేసుకోవచ్చును.
గత ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలు చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో చిన్న హీరోలతో యూ.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలు తిరుగులేని విజయాలు స్వంతం చేసుకొంటున్నాయి. యూ.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సాధిస్తున్న ఈ అద్బుత విజయాలు సహజంగానే పెద్ద హీరోలనీ ఆకర్షిస్తున్నాయి. భలే భలే మగాడివోయ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తను కూడా యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలనుకొంటున్నానని తెలిపారు. రామ్ చరణ్ తేజ్ కూడా యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి ఇప్పటికే ఆ సంస్థ అధినేతలు ప్రమోద్, వంశీలతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న తమిళ రీమేక్ (తన్నివొరివాన్) సినిమా షూటింగ్ పూర్తి కాగానే యూ.వి.క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలని రామ్ చరణ్ తేజ్ ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం.
నాని, శర్వానంద్, గోపీ చంద్ వంటి హీరోలతో సినిమాలు చేయడం యూ.వి.క్రియేషన్స్ కి పెద్ద కష్టమేమీ కాదు. కానీ అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే వాటి బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పెద్ద హీరోలతో సినిమా అనగానే రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ తప్పనిసరి కనుక కమర్షియల్ ఫార్ములాకే కట్టుబడి సినిమా తీయాల్సి ఉంటుంది తప్ప వారితో ‘భలే భలే మగాడివోయ్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి ప్రయోగాలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ధైర్యం చేసి తీసినా ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం. అలాగే పెద్ద హీరోల సినిమాలు అనగానే వారి అభిమానులలో చాలా అసాధారణమయిన స్థాయిలో అంచనాలు ఉంటాయి. కనుక మరికొంత కాలం చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బాగా నిలద్రొక్కుకొన్న తరువాతనే పెద్ద హీరోలతో ప్రయోగాల గురించి ఆలోచించడం మంచిదని శ్రేయోభిలాషులు యూ.వి.క్రియేషన్స్ కి సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.