ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో… వినయ విధేయ రామ ఒకటి. టాక్ పరిస్థితి ఎలా ఉన్నా… వసూళ్లు బాగానే ఉన్నాయి. సినిమా రిజల్ట్‌తో పోల్చి చూస్తే.. ఈ మాత్రం వసూళ్లు రావడం గొప్పే. కాకపోతే.. దర్శకుడిగా బోయపాటి శ్రీను అనేక విమర్శల్ని, వ్యంగ్య బాణాల్ని ఎదుర్కోవాల్సివచ్చింది. ఈమధ్య కాలంలో ఈ సినిమాకి జరిగినంత ట్రోలింగ్ ఏ సినిమాకీ జరగలేదు. యాక్షన్ సీన్లు చూసి నవ్వుకోవడం, ఎమోషన్ సీన్లు కామెడీగా మారడం కూడా వినయవిధేయ రామతోనే జరిగింది. దీనికి పూర్తి బాధ్యుడు బోయపాటి శ్రీనునే. చరణ్ సినిమా అనగానే విపరీతమైన జోక్యం చేసుకునే చిరంజీవి కూడా బోయపాటిపై నమ్మకంతో.. ఈసినిమా విషయంలో స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖరికి ఫైనల్ కాపీ చూడకుండానే.. సినిమాని బయటకు వదిలేశాడు.
కానీ.. బోయపాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమా తీసి అసలుకే ఎసరు తెచ్చాడు. సినిమా విడుదలయ్యాక… కనీసం చిరు నుంచి గానీ, చరణ్ నుంచి గానీ బోయపాటికి ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్లలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. మెగా ఫ్యామిలీ సినిమాలంటే చిరు కోసం ప్రత్యేకంగా ఓ షో వేస్తారు. సినిమా చూసి మీడియాతో తన అభిప్రాయం పంచుకుంటాడు చిరు. వినయ విధేయ రామకి అలాంటిదేం జరగలేదు. సినిమా ఫలితం ఎలాఉన్నా.. రెండో రోజో, మూడో రోజో సక్సెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా మారింది. కానీ.. వినయ విధేయ దానికీ నోచుకోలేదు. చిరు, చరణ్ బోయపాటిని పూర్తిగా దూరం పెట్టేశారని, ఒకవేళ సక్సెస్ మీట్ పెట్టినా చరణ్ డుమ్మా కొట్టడం ఖాయం కాబట్టి… అలాంటి ప్రయత్నాలేం చేయడం లేదని తెలుస్తోంది.