చిరంజీవి, బాలకృష్ణ…
దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టుకొన్న అగ్ర హీరోలు. చాలా ఏళ్ల పాటు తెలుగు సినిమాని తమ భుజాలపై కాపు కాశారు. రికార్డు వసూళ్ల గురించి జనం అప్పట్లో మాట్లాడుకొన్నారంటే దానికి కారణం వీళ్లిద్దరే. బాలయ్య ఓ రికార్డు కొట్టడం, వెంటనే చిరు దాన్ని చెరిపేయడం.. మళ్లీ బాలయ్య అధిగమించడం ఇలా సాగింది వాళ్ల ఫైట్. ఈ సంక్రాంతికీ చిరు, బాలయ్యల మధ్య నువ్వా నేనా అనేలా వార్ జరగబోతోంది. చిరు, బాలయ్యల సినిమాలు సంక్రాంతికి ఢీ కొట్టబోతున్నాయి. సాధారణంగా ఒకేసారి వస్తున్న సినిమాలు కాబట్టి.. వాటిమధ్య పోటీ, పోలికలు కామన్‌గా మొదలైపోతాయి. ఖైదీకి పోటీగా శాతకర్ణి రాబోతోందని తెలియగానే బాలయ్య రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. అయితే రాను రాను లెక్కలు మారిపోయాయి. గౌతమి పుత్రపై అంచనాలు పెరిగిపోవడం.. ఖైదీపై తగ్గుతూ రావడం మొదలైంది. గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ చూశాక దాన్ని బాహుబలి స్థాయి సినిమాలా గుర్తిస్తున్నారు సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు. చిరంజీవి అమ్మడు కుమ్ముడు పాట చూశాక ఖైదీపై అంచనాలు తారు మారు అయ్యాయి. సినిమా కూడా ఇలానే రివర్స్ కొడుతుందేమో అంటూ భయపడుతున్నారు ఫ్యాన్స్.
దానికి తోడు టీజర్ కూడా అద్భుతంగా ఏమీ లేదు. ఇప్పుడు చిరు అనవసరంగా బాలయ్యకు పోటీగా వెళ్తున్నాడేమో అంటూ బెంగపెట్టుకొంటున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో నెగిటీవ్ వార్తల్నీ విశ్లేషణలనూ ఎప్పటి కప్పుడు చెక్ చేస్తున్న `మెగా` టీమ్… ఈ మైనస్సులే మాకు ప్లస్సులు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సినిమాపై అంచనాలు తగ్గడం మంచిదే అని.. అంచనాలు పెరిగితేనే కష్టమని మెగా కాంపౌండ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాంతో ‘గౌతమి పై అంచనాలు పెంచుకోవడం ఆ సినిమాకే నష్టం’ అంటూ వ్యాఖ్యానించినట్టైంది.
అంచనాలు పెంచుకొచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ఆ ప్రమాదం తమ సినిమాకి ఉండదని మెగా కాంపౌండ్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. మాస్ పల్స్ పట్టేసిన వినాయక్.. ఈ సినిమానీ మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దాడని, మెగా అభిమానుల ఆశలు, అంచనాలు అందుకొనేలా ఈ సినిమా ఉంటుందని, ఇప్పుడు ఎవరేమన్నా.. థియేటర్లో చిరు అందించే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి సంక్రాంతి విజేతగా నిలపుతుందని మెగా వర్గీయులు జోస్యం చెబుతున్నారు. చిరు – బాలయ్య సినిమాలు దేనికదే. గౌతమి పుత్ర, ఖైదీ.. ఈ రెండింటినీ జనం ఎలా ఉన్నా చూస్తారు. ఎందుకంటే గౌతమి పుత్ర ఓ కథ కాదు. చరిత్ర. అది తెలుగువాడి ఖ్యాతి. పైగా బాలయ్య వందో సినిమా. ఇక ఖైదీ విషయానికొస్తే.. మాస్‌కి నచ్చే అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. దానికి తోడు చిరు రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. చిరు డాన్సులు ఎలా చేశాడు, ఫైట్స్ ఎలా చేశాడు, చిరు చరిష్మా తగ్గిందా, లేదా అనే విషయాలు తెలుసుకోవడానికైనా ఖైదీ టికెట్లు తెగుతాయి. అయితే ఈ రెండు సినిమాల్లో దేనిది పై చేయి అనేది మాత్రం ప్రేక్షకులే చెప్పాలి.