ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ-గుంటూరు మద్య నిర్మించబోతున్నట్లు ప్రకటించినప్పుడు, రాజధానిని కర్నూలు జిల్లాలో లేదా రాయలసీమలో ఎక్కడయినా నిర్మించాలని కర్నూలు జిల్లావాసులు ఉద్యమానికి సిద్దం అయ్యారు. కానీ కర్నూలుతో సహా రాయలసీమ జిల్లాలన్నిటి అభివృద్ధి కోసం ప్రభుత్వం సిద్దం చేసుకొన్నా ప్రణాళికలు బహిర్గతం చేసిన తరువాత వారు శాంతించారు. హామీ ఇచ్చినట్లుగానే చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు, అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటి తరువాత ఈరోజు కర్నూలు జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేశారు. తరువాత కడపలో మెగా పారిశ్రామిక హబ్ కి శంఖు స్థాపన చేస్తారు.
ఈ సందర్భంగా ఆయన కర్నూలులో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జిల్లాలో అన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ రానున్న నాలుగేళ్లలో జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోబోతోంది. కర్నూలు జిల్లాలో మొట్టమొదటగా జైన్ ఇరిగేషన్ సంస్థ, అంబుజా సంస్థ రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతాయి. రూ.250 కోట్లు ఖర్చు చేసి జిల్లాలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాము. మౌలికవసతులు సమకూరితే జిల్లాలో పరిశ్రమలు స్థాపన మరింత వేగవంతం అవుతుంది. రానున్న నాలుగేళ్ళలో జిల్లాకి సుమారు రూ. 3, 000 కోట్లు పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాము. వాటి ద్వారా జిల్లాలో కనీసం 18, 000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఏర్పడుతుంది. రాయలసీమ జిల్లాలకి నీళ్ళు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకి కొందరు స్థానిక నేతలు కూడా అడ్డుపడుతుండటం చాలా శోచనీయం. ఇక్కడ ప్రజలకి నీళ్ళు అంది వ్యవసాయ పనుల్లో, కంపెనీలు స్థాపించబడి యువత ఉద్యోగాలలోకి వెళ్ళిపోతే తమ ఆటలు సాగవనే భయంతోనే స్వార్ధపరులయిన కొందరు నేతలు జిల్లా అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారు. కానీ మా ప్రభుత్వం అటువంటి అవరోదాలన్నీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. రూ.250 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాని రాజధాని అమరావతిని కలుపుతూ నాలుగు వరసల రోడ్లు వేయబోతున్నాము. జిల్లాలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగేందుకే ఇక్కడ ఈ మెగా ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నాము. సరిగ్గా నేటి నుండి 18 నెలల తరువాత ఇక్కడ ఉత్పత్తి కార్యక్రమాలు మొదలవుతాయి. మళ్ళీ నేనే స్వయంగా వచ్చి దానిని ప్రారంభిస్తాను,” అని తెలిపారు.