మెగా హీరోలకు గుర్రాలంటే పిచ్చి. చిరంజీవి, పవన్, బన్నీ, రామ్ చరణ్.. ఇలా అంతా గుర్రం ఎక్కిన హీరోలే. తాజాగా `వినయ విధేయ రామ`లో ఓ స్టిల్ బయటకు వచ్చింది. అందులో నల్లని గుర్రాన్ని సవారీ చేస్తున్న…. చరణ్ నిచూస్తే ముచ్చటేసింది. గుర్రాలపై దౌడు తీయడం అనే కాన్సెప్టు మెగా హీరోలకు వర్కవుట్ అయినట్టు మిగిలినవాళ్లకు అవ్వదేమో.
చిరుకి గుర్రాలంటే పిచ్చి. తను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు.కొదమ సింహం అనే సినిమాలో గుర్రపు స్వారీ చేస్తూనే ఉంటాడు చిరు. ఓ పాటలోనో, ఫైటులోనో గుర్రాన్ని చూపించడం చిరు అలవాటుగా మార్చుకున్నాడు. అల్లుడా మజాకాలో గుర్రంతో ఓ ఫైట్ సీన్ ఉంది. గుర్రాన్ని బైక్‌లా ఈడ్చుకుంటూ.. లారీ కింద నుంచి వెళ్లిపోతాడు. అది కాస్త టూ మచ్‌గా అనిపించినా.. గుర్రాన్ని భలే వాడుకున్నాడు చిరు. అంతెందుకు.. చాలా కాలం తరవాత రీ ఎంట్రీ ఇచ్చిన `బ్రూస్లీ`లోనూ చిరు గుర్రంతోనే వచ్చాడు. `సైరా`లో యుద్ధాలన్నీ గుర్రంతోనే. ఆ వారసత్వం పవన్ కల్యాణ్‌కి వచ్చింది. తనకీ గుర్రాలంటే మోజు. `బద్రి` సినిమాలో గుర్రంతో ఓ పాట ఉంటుంది. గబ్బర్ సింగ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
చిరు అలవాటు… చరణ్‌కి వచ్చింది. తను కొన్ని మేలు జాతి గుర్రాల్ని పెంచుతున్నాడు కూడా. షూటింగ్లో వాడే గుర్రాల్ని చాలా త్వరగా మచ్చిక చేసుకోగలడు. బ్రూస్లీ సినిమాలో చిరుతో పాటు గుర్రపు సారీ చేశాడు. మగధీరలో గుర్రాలపై ఫైటింగులు మామూలే. ఇప్పుడు `వినయ విధేయ రామ` కోసం కూడా గుర్రం ఎక్కేశాడు. బన్నీ అయితే `రేసుగుర్రం` అనే టైటిల్‌తోనే సినిమా చేసేశాడు. గుర్రం పక్కన పరిగెట్టాడు గానీ, గుర్రపు సవారీ మాత్రం చేయలేదు. ఆ లోటు రుద్రమదేవి తీర్చింది. ఇందులో బన్నీ గుర్రపు సవారీ చేశాడు. సాయిధరమ్ తేజ్ కూడా గుర్రపు సవారీ చేయడంలో దిట్ట. సుప్రీమ్, విన్నర్ చిత్రాల్లో తేజూ గుర్రం ఎక్కేశాడు. ఇక మిగిలింది… వరుణ్‌తేజ్, శిరీష్ మాత్రమే. అలా మొత్తమ్మీద గుర్రపు సవారీ అనేది మెగా కాంపౌండ్‌కి సెంటిమెంట్‌గా మారిపోతోంది.