పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్.ఏగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి పవన్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాలన్నది మెగా అభిమానుల ఆశ. జనసైనికులు కూడా బాగా కష్టపడుతున్నారు. పవన్‌కు కనీసం 60 వేల మెజార్టీ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ప్రచారంలో ఉధృతిని మాత్రం ఎవరూ ఎక్కడా తగ్గించడం లేదు. ఏ చిన్న విషయాన్నీ నిర్లక్ష్యం చేయడం లేదు. పవన్ ని ఎలాగైనా లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని జనసైనికులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు మెగా హీరోలు సైతం.. పవన్ కోసం పిఠాపురం వెళ్లబోతున్నారని, పవన్ కోసం ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇందులో తొలి అడుగు వరణ్‌తేజ్ వేయబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలోనే వరుణ్ పిఠాపురం వెళ్తున్నాడని బాబాయ్ కోసం ప్రచారం చేస్తున్నాడని సమాచారం అందుతోంది. వరుణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కొందరైతే ఏకంగా చిరంజీవినే స్వయంగా పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే చిరు వెళ్లే అవకాశాలు లేవు. ఈమధ్య తన సన్నిహితులైన కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చిరు ఓ వీడియో పెడితే, వైకాపా నేతలు మరీ టూమచ్ చేశారు. అందుకే రాజకీయాలకు సంబంధించిన విషయాలపై చిరు మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టం చూపించడం లేదు. చిరు మద్దతు పరోక్షంగానే ఉంటుందని, ఆయన ప్రచారంలో కనిపించరని చిరు సన్నిహితులు చెబుతున్నారు.