పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగాస్టార్ చిరంజీవిలతో మెగా మల్టీస్టారర్ మూవీ తీస్తున్నానని చెప్పి సంచలనం రేకెత్తించాడు టి. సుబ్బిరామిరెడ్డి. రాజీకీయ వేదికలపై కూడా చాలా మంచి కామెడీని పండిస్తూ ఉండే టిఎస్సార్ మాటలను మామూలుగా అయితే ఎవ్వరూ సీరియస్‌గా తీసుకుని ఉండేవారు కాదు. కానీ ఖైదీ నంబర్ 150 సినిమా సక్సెస్ పార్టీ అని చెప్పి చిరంజీవికి సన్మానం చేయడం, ఓ పెళ్ళి సందర్భంగా పవన్‌తో కూడా సన్నిహితంగా మూవ్ అవడం లాంటివి చూసి నిజంగానే అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అని చాలా మంది సందేహించారు. ఆ తర్వాత మెగా మల్టీస్టారర్‌ని టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తాడని ఫీలర్లు వదిలాడు టీఎస్సార్. దాంతో నిజంగానే తెరవెనుక ఏదో జరుగుతోందని చాలా మంది నమ్మారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక్క మాటతో టిఎస్సార్ మాటల్లో ఉన్నదంతా గ్యాసే అన్న విషయం అందరికీ అర్థమైపోయింది. కామెడీగా మాట్లాడినా తను మాట్లాడే మాటలకు కూడా ఎంతో కొంత విశ్వసనీయత ఉంటుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత టిెఎస్సార్పైన పడింది. అందుకే గతంలోనూ సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించిన టిఎస్సార్ సూపర్ స్టార్స్ ఫాలో అయ్యే ఒక ట్రిక్ని వాడేసి సక్సెస్‌ఫుల్‌గా సంకటం నుంచి బయటపడిపోయారు.
తెలుగులో ఉన్న నలుగురు సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలను మీరందరూ కలిసి మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించండి? అలాగే పవన్-మహేష్, ఎన్టీఆర్-చరణ్, చిరు-పవన్-చరణ్….ఇలా ఏ ఇద్దరు టాప్ రేంజ్ ఉన్న స్టార్ హీరోస్ అయినా కలిసినటించబోయే మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు అని ఎవరిని ప్రశ్నించినా వాళ్ళ నుంచి ఒకటే సమాధానం వస్తుంది. మామూలుగా అయితే బాలీవుడ్లో అలాంటివి సాధ్యం మన దగ్గర కొంచెం కష్టం అని ఆయా హీరోలు చెప్పొచ్చు. కానీ ఆ సమాధానం విన్న వెంటనే మన విమర్శకులు రెచ్చిపోతారు. ఇగోలు పక్కన పెట్టలేరా? బాలీవుడ్ నుంచి చూసి నేర్చుకోండి, సూపర్ స్టార్ హీరోస్ కూడా కలిసి నటిస్తూ ఎంత గొప్ప గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారో అని విమర్శల వర్షం కురిపిస్తారు. అలాంటి విమర్శల గోల మనకు ఎందుకు అనుకుంటారు కాబట్టే మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించిన ఏ ప్రశ్న ఎదురైనా మన స్టార్ హీరోలందరూ ఒకే సమాధానం చెప్తూ ఉంటారు. కథ కుదిరితే అందరు హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అంటారు. మా లాంటి ఇద్దరు టాప్ రేంజ్ హీరోలు కలిసి నటించాలంటే బోలెడన్ని క్యాలిక్యులేషన్స్ని లెక్కలోకి తీసుకోవాలి. ఆ రేంజ్ కథతో ఎవరు ముందుకొచ్చినా నేను రెడీ అని చెప్తూ ఉంటారు. ఆ కథ సెట్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటి మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో రావు కూడా. ఈ విషయాలన్నీ తెలిసినవాడు కాబట్టే సుబ్బిరామిరెడ్డి కూడా ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చేశాడు. కథ కావాలి కదా? కథ రెడీ అయిన వెంటనే పవన్, చిరులతో కలిసి మల్టీస్టారర్ సినిమా తీస్తా అని ఓ ప్రకటన పడేశాడు. పవన్-చిరుల ఇమేజ్‌కి సరిపోయే కథ సెట్ అయ్యేదీ ఉండదూ……సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా మెగా మల్టీ స్టారర్ సినిమాకు ఇప్పట్లో కొబ్బరి కాయ కొట్టే అవకాశమూ లేదు. అలా మెగా మల్టీస్టారర్ అంటూ తను రేపిన సంచలనానికి శుభం కార్డు కొట్టేశారన్న మాట శ్రీమాన్ సుబ్బిరామిరెడ్డి.