పరాజయాల నుంచి త్వరగా పాఠాలు నేర్చుకుంటారు చిరంజీవి. అందుకే…. ఆయన కెరీర్ ఇన్నేళ్ల పాటు దిగ్విజయంగా సాగుతోంది. `ఆచార్య` చిరుకి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమా పరాజయంతో.. చిరు ఆలోచనలో పడ్డారు. ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయాలి? ఎవరితో చేయాలి? అనే విషయంపై ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు ఆయన లైనప్ చాలా బలంగా ఉంది. వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. లైన్లో ఉన్నాయి. ఒకొక్క సినిమాకీ కొన్నేసి కాల్షీట్లు కేటాయిస్తూ, సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ముందు `వాల్తేరు వీరయ్య` పూర్తి చేసి, ఆ తరవాత మిగిలిన సినిమాలు మొదటెట్టాలని చూస్తున్నార్ట.
వాల్తేరు వీరయ్య…చిరు స్టైల్లో సాగే సినిమా. మాస్ గా ఉండబోతోంది. పైగా స్ట్రయిట్ కథ. గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేకులు. ఆ కథల గురించి ప్రేక్షకులకు అవగాహన ఉంది. కాబట్టి.. ఎంత బాగా చేసినా, మాతృకతో పోలికలు వెదుకుతారు. పైగా రీమేకులతో హిట్టు కొట్టినా పెద్దగా కిక్ రాదు. వాల్తేరు వీరయ్య స్ట్రయిట్ కథ కాబట్టి.. ఈ సినిమాని పూర్తి చేసి, విడుదల చేసి, హిట్టు కొట్టాలని చిరు భావిస్తున్నారు. అందుకే కాల్షీట్లన్నీ.. వాల్తేరు వీరయ్యకే కేటాయించబోతున్నార్ట. గాడ్ ఫాదర్ ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్టులో విడుదల అనుకుంటున్నారు. అంతకంటే ముందే.. వీరయ్య పూర్తవుతుందో, లేదో చూడాలి. త్వరలోనే మలేషియాలో `వాల్తేరు వీరయ్య` కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.