మెగాస్టార్ చిరంజీవి మరొక మంచి పనికి శ్రీకారం చుడుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కార్మికులకు , సినీ పరిశ్రమకు చెందిన మిగతా వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించడానికి స్వయంగా పూనుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కిందట, అప్పట్లో రక్తం దొరకక పేషెంట్స్ చనిపోతున్నారు అన్న వార్త విని చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి ఐ బ్యాంకు కూడా స్థాపించారు. ఇక కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. కిందిస్థాయి సినీ కార్మికులకు మొదటి లాక్డౌన్ సమయంలో రేషన్ సరుకులు కూడా సరఫరా చేయించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సందర్భంలో ఆక్సిజన్ కొరత అతి పెద్ద సమస్యగా మారిందని తెలిసి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించారు. అయితే చిరంజీవి ప్రయత్నానికి తెలుగు మీడియా నుండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి గాని ఏ మాత్రం ప్రోత్సాహం లభించలేదు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చిరంజీవి ఇప్పుడు మరొక ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ లో పనిచేసే సినీ కార్మికులు అందరికీ వ్యాక్సినేషన్ వేయించడానికి చిరంజీవి చొరవ తీసుకున్నారు. అపోలో హాస్పిటల్ సహా మరికొన్ని హాస్పిటల్స్ తో చిరంజీవి అనుసంధానం అవుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి అందరికీ వ్యాక్సినేషన్ చేయించేలా మెగా కార్యక్రమానికి చిరంజీవి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మొత్తం మీద సినీ కార్మికుల కోసం చిరంజీవి తీసుకుంటున్న చొరవకు సినీ పరిశ్రమ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.