ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్‌కు ఉన్న సమస్యలపై చర్చించడానికి రావాలని చిరంజీవికి ఏపీ సీఎం జగన్ ఆహ్వానం పలికారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలు రావొచ్చని కబురు పంపారు. మంత్రి పేర్ని నాని నేరుగా ముఖ్యమంత్రి తరపున నేరుగా చిరంజీ వికి ఫోన్ చేసి.. సీఎంతో భేటీ అయి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు. నెలాఖరులో సమావేశం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో సినీ రంగానికి ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. ధియేటర్లు ఇంత వరకూ తెరుచుకోలేదు. ఆ రంగం మీద ఆధారపడి ఉన్నవారికి ఇప్పటికీ ఉపాధి లభించడంలేదు.
ఏపీ సర్కార్ మూడు షోలు వేసుకునే అవకాశం ఇచ్చినా ఎక్కువ మంది అలా తెరిస్తే తమకు లాస్ అని మూసేసుకునే ఉంటున్నారు. అంతకు మించి టాలీవుడ్‌కు అతి పెద్ద సమస్యగా టిక్కెట్ రేట్స్ ఉన్నాయి. పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను నియంత్రించడానికి రాత్రికి రాత్రి జీవోలు తీసుకు వచ్చారు. పదేళ్ల కిందటి ధరలను ఖరారు చేయడంతో టాలీవుడ్ షాక్‌కు గురైంది. అవే రేట్లు కొనసాగితే పెద్ద సినిమాలు ఇబ్బంది పడాల్సి వస్తుందనే భావన అందరికీ వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ పెద్దల భేటీలో టిక్కెట్ రేట్ల సమస్యను పరిష్కరించుకుని గతంలోగా ఓపెనింగ్స్ బాగా వచ్చే సమయంలో రేట్లను పెంచుకునే అవకాశం మళ్లీ ఇప్పించుకోగలిగితే గొప్ప విజయం సాధించినట్లే. అయితే ప్రభుత్వం మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్‌ను మాత్రమే టార్గెట్ చేసి ఆ సినిమాకు నష్టం చేయడానికే.., అప్పట్లో టిక్కెట్ రేట్లపై రగడ సృష్టించారని అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.