మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఓ డైలాగ్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం రకరకాల చర్చలకకు కారణం అవుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ రాజకీయాలు తన నుంచి దూరం కాలేదని చిరంజీవి వ్యాఖ్యానించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. రాజకీయాల గురించి ఇటీవలి కాలంలో చిరంజీవి మాట్లాడటం ఇదే ప్రథమం. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చెబుతున్నారు. కానీ ఏపీలో వైసీపీ నేతలు మాత్రం ఆయనను పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లిన తరవాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతారన్న ప్రచారం చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ ను విమర్శించే వైఎస్ఆర్సీపీ నేతలు చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తూంటారు. పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించేటప్పుడు ఖచ్చితంగా చిరంజీవి ప్రస్తావన తెస్తారు. అన్నకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఇలా తనను రాజకీయాల్లోకి పదే పదే తీసుకు వస్తూండటంతో… అసహనంతోనే చిరంజీవి ఈ కామెంట్ పెట్టారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆయన ప్రధాన ఉద్దేశం ఇదే కానీ అసలు ఆ డైలాగ్ సినిమాలోదన్న వాదన వినిపిస్తోంది. మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌కు గాడ్ ఫాదర్‌ను తెరకెక్కించారు. బజ్ లేకపోవడంతో మార్కెటింగ్ సమస్యలు వస్తున్నాయి. దీంతో బజ్ కోసం ఈ డైలాగ్‌ను వదిలారన్న వాదన ఉంది. ఆ సినిమా రాజకీయ నేపధ్యం ఉన్నదే. ఆ క్యారెక్టర్‌కు ఆ డైలాగ్ సరిపోతుంది. అది సినిమాలోదనే ఎక్కువ మంది నమ్ముతున్నారు.