ప్రతీ జిల్లాలోనూ ఓ ఆక్సిజన్ బ్యాంక్… – చిరంజీవి నుంచి వచ్చిన ప్రకటన ఇది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు.. ఇది తీపి వార్తే. చిరంజీవి లాంటి సెలబ్రెటీ నుంచి జనాలు ఆశిస్తున్న వార్త. కాస్త ఆలస్యమైనా – ఓ మంచి నిర్ణయం తీసుకున్న చిరుని అభినందించి తీరాలి.
స్టార్లు ట్విట్టర్లో మాటలతో పులిహోర కలపడం తప్ప, ఇంకేం చేయడం లేదని, సోనూసూద్ లాంటి వాళ్లని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ మధ్య విమర్శలు ఎక్కువయ్యాయి. నిజానికి అవి విమర్శలేం కాదు. నిజాలే. ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఆక్రోశం. వాస్తవానికి కొంతమంది రాజకీయ నాయకుల కంటే… సినీ తారలే ఎక్కువ చేశారు. చేస్తున్నారు కూడా. దేశంలో ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా – ముందుగా ఆదుకునేది సినీ తారలే. అయితే కరోనా సెకండ్ వేవ్ లో… ఆ హవా ఎక్కడా కనిపించలేదు. సినీ తారల్ని, రాజకీయ నాయకులకంటే, ఇంట్లో అమ్మానాన్న కంటే, ఎక్కువ ఆరాధించే అభిమానులు… ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో… హీరోలు మౌనంగా ఉండడం చూసి భరించలేకపోయారు. అందుకే విమర్శలు వినాల్సివచ్చింది.
ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితులో చిరు ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. జిల్లాకో ఆక్సిజన్ బ్యాంక్ అంటే మాటలు కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చిరు లాంటి వ్యక్తి రెండు మూడు కోట్లు ఉదారంగా విరాళం ప్రకటించొచ్చు. విమర్శలకు ముందే చెక్ పెట్టొచ్చు. కానీ… ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కోట్ల విరాళం ప్రకటిస్తే సమస్య తీరిపోదు. ఆ డబ్బుల్ని సరైన రీతిలో ఖర్చు పెట్టాలి. చిరు ఇప్పుడు చేస్తోంది అదే. చిరు ఏం చేసినా ఆలోచించి చేస్తారనిన ఆయన అభిమానులు అంటుంటారు. సీసీసీ ఏర్పాటు వెనుక.. చిరు ఆలోచనలే ఉన్నాయి. ఏదో సినీ కార్మికులకు అప్పటికప్పుడు సహాయం చేసి చేతులు దులుపుకోవడం కాదు. సహాయం చేయడానికి ఓ బలమైన వ్యవస్థని ఏర్పాటు చేయగలిగారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు ఏర్పాటు వెనుక కూడా.. సుదీర్ఘమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకుల కూడా అలాంటి ఆలోచనలే నడిపించి ఉండొచ్చు. మొత్తానికి చిరు నిర్ణయం ఆహ్వానించదగిన పరిణామం. మిగిలిన హీరోలు కూడా ఇలా తమ చేతనైనంత సాయం చేస్తే… ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు బాసట అందించినవారవుతారు.