మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై లంచం కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి రూ.174 కోట్ల బిల్లులను పొందడానికి మేఘా అధికారులకు దాదాపు రూ.78 లక్షలు లంచాలు ముట్టజెప్పిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్‌ఐఎస్‌పీ, ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. మేఘాకు ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఐదేళ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో పాటు మరికొన్ని ఇతర పనులు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేసుకునేందుకు.. అనంతరం బిల్లుల క్లియరెన్స్‌లో అధికారులకు మేఘా లంచాలు ఇచ్చింది.
అధికారులకు ఇచ్చిన లంచాలపై కేసులు పెట్టిన సీబీఐ అధికారులు.. ఇదే మేఘా కంపెనీ రాజకీయ పార్టీలకు వందల కోట్ల చందాలు ఇచ్చింది. ఇవి చందాలు కాదు లంచాలని అందరికీ తెలిసిన విషయం. ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. మేఘా ఇంజినీరింగ్ రూ. 966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ను కొనుగోలు చేసింది. రూ.586 కోట్లను బీజేపీకి ఇచ్చింది. బీఆర్ఎస్కు రూ.195 కోట్లు, వైసీపీకి రూ.37 కోట్లు ఇచ్చింది. ప్రతిఫలంగా మెఘా కంపెనీ కాంట్రాక్టులు పొందడం.. బిల్లులు మంజూరు చేయించుకోవడం వంటి ప్రయోజనాలు పొందింది.
అయితే ఈ అంశంలో ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ అధికారులపై లంచాల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకూ కోట్ల రూపాయల్లో విరాళాలు అందించిన మేఘా ఇంజనీరింగ్‌పై లోక్‌సభ ఎన్నికల ముందు సిబిఐ చర్యలు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇది ఓ రకమైన రాజకీయమని.. తెర వెనకు కొన్ని లెక్కలు సెటిల్ చేసుకునే రాజకీయం ఇమిడి ఉందని రాజకీయవర్గాలు అనుమానిస్తున్నాయి.