మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఓ వార్తను ప్రచారం చేయవద్దని ఖమ్మం కోర్టులో పిటిషన్ వేసి ఆ మేరకు ఆదేశాలు తెచ్చుకుంది. ఇటీవల ఆ సంస్థ తెలంగాణలోని ఉన్నతాధికారి కుమార్తె పెళ్లి ఖర్చులను మొత్తం భరించిందని అందు కోసం షెల్ కంపెనీలను వాడిందన్న ఆరోపణలను ఓ ఇంగ్లిష్ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు…సాక్ష్యాలను కూడా ప్రచురించింది. తాము రాసిన కథనానికి అన్ని సాక్ష్యాలను ఇస్తామని సవాల్ చేసింది. అయితే ఆ కథనంపై మేఘా ఎలాంటి స్పందనలు వ్యక్తం చేయలేదు.
తమ సంస్థలోని అధికారులు వ్యక్తిగతంగా ఆ ఉన్నతాధికారికి సహకరించి ఉంటారని చెప్పుకున్నారు. అయితే తమ సంస్థ గురించి ప్రచారం జరుగుతోందని అలాంటివి జరగవద్దని ఖమ్మం కోర్టులో పిటిషన్ వేసి.. ఆ వార్తల సర్క్యూలేషన్ను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు తీసుకు వచ్చారు. ఈ వార్త రాసిన వారిపై ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని మేఘా పత్రికల్లో ఇచ్చినప్రకటనల్లో తెలిపింది. అయితే ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో కానీ ఈ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికి అంత కంటే ఎక్కువే ఖర్చయ్యే అవకాశం ఉంది.
అన్ని ప్రధాన దినపత్రికలలో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఈ ప్రకటన ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆ కథనం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడం ఆపడం అంత తేలిక కాదు. అయినా ఇంత ఖర్చు పెట్టుకుని మేఘా ఆ వార్త ప్రచారం కావొద్దని ఎందుకు అంత తాపత్రయపడుతుందో మరి. ఆ వార్త తప్పయితే .. ఆ వార్తా సంస్థ ప్రకటించినట్లుగా తప్పుడు వివరాలు అని బయట పెట్టాల్సి ఉంది. మేఘాకు కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది. ప్రధానమైన మీడియా మేఘా వెంట ఉంది. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ?