మేఘా గ్రూపు కంపెనీలు ఏపీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చాయి. వరద బాధితుల కోసం బడా కాంట్రాక్టర్లు స్పందించలేదని విమర్శలు వస్తున్న సమయంలోనే మేఘా కృష్ణారెడ్డి సోదరులు విజయవాడలో చంద్రబాబును కలిశారు. రూ. ఐదు కోట్ల చెక్ ను అందించారు. తమ కంపెనీ విజయవాడ వరద బాధితుల కోసం విస్తృతంగా శ్రమించిందని ఆహారం, వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేశామని మేఘా కంపెనీ తెలిపింది. అలాగే బుడమేరు గండ్లు పూడ్చడంలోనూ తమ వంతు సాయం చేశామని తెలిపింది.
గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన మేఘా కృష్ణారెడ్డి.. ఏపీలో జరిగిన ప్రతి బడా కాంట్రాక్టును వారి ఖాతాలోనే వేసుకున్నారు. చివరికి ఎత్తిపోతల తప్ప.. పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవం లేకపోయినా రివర్స్ టెండరింగ్ పేరుతో అతి తక్కువకు కోట్ చేసి పోలవరం కాంట్రాక్ట్ పొందారు. కానీ పనుల్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. తెలంగాణలో.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వారు పెద్దగా బయట కనిపించడం లేదు.
తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి విరాళం ప్రకటించలేదు. బహుశా.. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణకూ ఓ రూ. ఐదు కోట్ల విరాళం ప్రకటించే అవకాశం ఉంది. మేఘా కాకుండా ఇంకా కొన్ని బడా కంపెనీలు.. జగన్ హయాంలో భారీగా కాంట్రాక్టులు పొందాయి. షిరిడి సాయి లాంటి సంస్థలు ఇంత వరకూ రూపాయి కూడా ప్రకటించలేదు.