కరోనా వైరస్‌పై పోరాటం చేయడానికి కేంద్రానికి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే.. ఎవరూ నేరుగా వెళ్లి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్… ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల దృష్ట్యా ఎక్కువ మంది.. ఇళ్లకే పరిమితమై.. చెక్కులు ప్రభుత్వానికి అందేలా చేయడం లేదా.. ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ లాంటి.. విధానాలను పాటిస్తున్నారు. కానీ.. మేఘా కృష్ణారెడ్డి అనే బడా పారశ్రామికవేత్త మాత్రం.. నేరుగా ముఖ్యమంత్రుల్ని కలిసి చెక్కులిస్తున్నారు. తెలంగాణలో కొన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేస్తున్న ఆయన గురువారం.. సీఎం కేసీఆర్ ను కలిసి.. రూ. ఐదు కోట్ల సాయం చెక్కు ఇచ్చారు. ఈ రోజు.. ఏపీకి వచ్చేసి.. తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి.. రూ. ఐదు కోట్ల చెక్కు ఇచ్చారు.
ఏపీలో రివర్స్ టెండరింగ్ లో… అత్యధిక లబ్దిదారులు మేఘా కృష్ణారెడ్డినే. పోలవరం ప్రాజెక్టుతోపాటు… పలు కీలక ప్రాజెక్టులు ఆయన సంస్థకు దక్కాయి. ఆయన ఐదు కోట్ల సాయం చేయడం గొప్ప విషయమే కానీ… ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎలా .. ఏపీకి వచ్చారు.. ఎలా అనుమతించారన్నది కీలకాంశం. తెలంగాణ నుంచి ఏపీలోకి రావడానికి పెద్ద ఎత్తున సరిహద్దుల్లో సామాన్యులు పడిగాపులు పడుతున్నారు. వారెవరూ లోపలికి అడుగుపెట్టకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి.. ఆపుతున్నారు. అలాంటి.. మేఘా కృష్ణారెడ్డి మాత్రం..నేరుగా తాడేపల్లికి వచ్చేశారు. బహుశా ఆయన ప్రత్యేక విమానంలోనో.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లోనే వచ్చి ఉంటారు.
ఇలా రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమే. పెద్దలకు ఓ నిబంధన.. పేదలకు ఓ నిబంధన అన్నట్లుగా ఉంటే… ప్రజలు కూడా.. వాటిని పాటించడానికి లైట్ తీసుకుంటారు. మేఘా కృష్ణారెడ్డి చేసిన సాయాన్ని అందరూ అభినందించాల్సిందే. కానీ దాన్ని నేరుగా ముఖ్యమంత్రికే ఇస్తానని.. ఆయన పట్టుబట్టి ఉంటే…. దానికి ప్రభుత్వ యంత్రాంగం అనుమతించి నిబంధనలు సడలించి ఉంటే మాత్రం.. లాక్ డౌన్లో సీరియస్ నెస్ తగ్గించినట్లే.