ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పడకేసింది. రివర్స్ టెండరింగ్‌తో దాదాపుగా ఐదు వందల కోట్లకు తక్కువకు పనులు చేస్తామని టెండర్ వేసి.. కాంట్రాక్టుల ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన మేఘా ఇంజినీరింగ్ సంస్థలు పనులు మాత్రం.. వేగంగా చేపట్టడం లేదు. వరదలు ఆగిపోయి.. రెండు, మూడు నెలలు అవుతున్నప్పటికీ.. స్పిల్ చానల్ వద్ద నిలిచిపోయిన నీరును తోడేయడానికే సమయం కేటాయిస్తోంది. ఇంత వరకూ అక్కడి నీటిని పూర్తి స్థాయిలో తోడేయలేదు. దాంతో పనులు కూడా ప్రారంభం కాలేదు.
భారీ యంత్రాలను తీసుకు రాని మేఘా..!
గతంలో నవయుగతో పాటు.. గేట్లు, మట్టి పనులు చేసేందుకు బేయర్, త్రివేణి వంటి సంస్థలు పనులు చేసేవి. విదేశాల నుంచి భారీ యంత్రాలను తీసుకు వచ్చి.. ఇరవై నాలుగు గంటలూ పని చేసేవారు. ఆ కాంట్రాక్ట్ సంస్థలను.. తరమేయడంతో.. తమ భారీ యంత్రాలను కూడా తీసుకుని వెళ్లిపోయారు. దాంతో.. ఇప్పుడు పోలవరం వద్ద కొన్ని ఎక్స్కవేటర్లు.. కొన్ని మిక్సింగ్ యంత్రాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాలను సమకూర్చుకునే సరికి.. మేఘా సంస్థకు మూడు, నాలుగు నెలలు పట్టవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ వరదలు వచ్చేటప్పటికైనా రెడీ అవుతారా..?
నిజానికి పోలవరం పనులు ఏడాదిలో.. ఆరేడు నెలలు మాత్రమే సాగడానికి అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభమైతే.. గోదావరికి వరదలు వస్తాయి. ఫలితం జూలై నుంచి..నవంబర్ వరకు.. పనులు జరగడానికి అనుకూలతలు తక్కువ. మిగతా సమయాల్లోనే పనులు వేగంగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంతో.. మూడేళ్లలోనే 70 శాతం వరకూ ప్రాజెక్ట్ పూర్తయింది. ఈ ప్రభుత్వం “రివర్స్” నిర్ణయాలు తీసుకోవడంతో.. పనులు ఆగిపోయాయి. మేఘా సంస్థ పూర్తి స్థాయిలో యంత్ర సామాగ్రి సమకూర్చుకునే సరికి మరో మూడు నెలలు అవుతుంది. పనులు ప్రారంభించే సరికి.. మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
నిధులు తెచ్చుకోలేకపోవడమే అసలు కారణమా..?
అదే సమయంలో.. నిధుల కొరత కూడా .. పనులు ప్రారంభం కాకపోవడానికి కారణంగా చెబుతున్నారు. జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరానికి కేంద్రం నిధులివ్వాలి. తీసుకొచ్చుకోవడంలో.. ఏపీ సర్కార్ విఫలమయింది. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు చేసింది. వాటిని తెచ్చుకోవడానికి ఏపీ సర్కార్ తంటాలు పడుతోంది. కనీసం కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతోంది. మొన్నటికి మొన్న రూ. 1800కోట్లు విడుదల చేశామని కేంద్రం చెప్పిందికానీ.. పైసా కూడా రాలేదు. ఏపీ సర్కార్ అడగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పోలవరంపై ఏపీ సర్కార్ ఖర్చు పెట్టేందుకు సిద్దంగా లేదు. ఫలితంగా.. పోలవరం ఆలస్యం అవడం ఖాయంగా కనిపిస్తోంది.