పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీ (పిడిపి)అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ముందు అనుకోన్నట్లుగా ఈ నెలాఖరులోగా కాక వచ్చే నెల 4వ తేదీన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఆ కార్యక్రమానికి ప్రధాని లేదా కొందరు కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది కనుక అందుకు వీలుగా ఏప్రిల్ 4కి ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడి నేటి నుండి మూడు రోజులు విదేశాలలో పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన 3వ తేదీకే మళ్ళీ డిల్లీ తిరిగి వచ్చేస్తారు కానీ ఆయనకి వేరే ఇతర కార్యక్రమాలు హాజరుకావలసి ఉన్నందున ముఫ్తీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలు తక్కువ. అయినా కూడా ఆయన వచ్చేందుకు వీలుగా ఈ ముహూర్తం పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న ప్రమాణస్వీకారం చేయగానే ఆమె మరునాడే శాసనసభను సమావేశపరచవచ్చును. ఎందుకంటే ఏప్రిల్ 8లోగా తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ సమావేశం నిర్వహించవలసి ఉంది. (అప్పటికి శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలవుతుంది.)
56 ఏళ్ల వయసున్న మహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. మొన్న శనివారంనాడు ఆమె గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రాని కలిసి తనకు భాజపా మద్దతు ఇస్తోంది కనుక ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతించవలసిందిగా కోరారు. రాష్ట్ర శాసనసభలో మొత్తం 87సీట్లు ఉండగా వాటిలో పిడిపికి 27, భాజపాకి 25మంది సభ్యులున్నారు. కనుక ఆమె భాజపా మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకు ముందు ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన నిర్మల్ సింగ్ మళ్ళీ ఆమె ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రి కాబోతున్నట్లు సమాచారం.