తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
నేను మారానోయ్
– అన్నాడు పూరి.
మార్పు మంచిదే. మారాలి కూడా. కాకపోతే వంద కిలోమీటర్ల స్పీడులో వెళ్లేవాడు… సగం తగ్గిపోవడం మార్పు కాదు.
పరిగెట్టేవాడు.. కుంటి నడక నడవడం మార్పు కాదు. మేఘాల్లో తేలిపోయేవాడు గురక పెట్టి పడుకోవడం మార్పు కాదు.
కాకపోతే.. పూరి తీసిన మెహబూబాలో అలాంటి మార్పే కనిపించింది. విసిగించింది. `పాత పూరినే బెటరేమో` అనిపించేలా చేసింది. ఇంతకీ `మెహబాబూ`లో పూరి చూపించిన మార్పేంటి?? ఆ మార్పుకు ప్రేక్షకులు ఇచ్చిన తీర్పేంటి?
కథ
పూరి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆ మాటకొస్తే కథే ఉండదు. కాకపోతే ఈ విషయంలో పూరి కొంచెం మారాడు. అది అసలు సిసలైన మార్పు. కొత్త కథ కాకపోయినా, పాత కథే తిరగరాసే ప్రయత్నం చేశాడు. గత జన్మలో ప్రేమికులు ఇద్దరు విడిపోతారు. ప్రేమ పొందడానికి మరోసారి జన్మెత్తుతారు. ఈ జన్మలో కలిశారా, లేదా? అనేదే మెహబాబూ. అదేంటి? ఇది ‘మూగమనసులు’, ‘జానకీ రాముడు’, ‘మగధీర’ కథలూ ఇవే కదా? అని మీరు అడగొచ్చు. అలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పే… పూరి తనదైన మార్పులు చేర్పులూ చేశాడీ కథలో. హీరో హీరోయిన్లు ఓ జన్మలో విడిపోయి, మరో జన్మ ఎత్తితే.. సాధారంగా పక్క ఊర్లో, అంత దూరం ఎందుకంటే.. పక్కింట్లో పుట్టేస్తుంటారు. కానీ పూరి… హీరో హీరోయిన్లని దేశాలు మార్చేశాడు. ఆ విధంగా కథలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ని పాకిస్థానీ చేసి.. హీరోని హిందూస్థానీగా మార్చాడు. దాంతో పునర్జన్మ కథ కాస్త.. హిందూస్థానీ పాకిస్థానీ లబ్ డబ్ లడాయిగా మారిపోయింది. మరి… దేశాల సరిహద్దుల్ని చెరిపేసి ఈ ప్రేమికులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే పాయింట్.
విశ్లేషణ
సరిహద్దులు దాటిన ప్రేమ కథ ఇది. హీరోయిన్‌ది పాకీస్థాన్, హీరోది ఇండియా. వీరిద్దరి మధ్య జరిగే కథలో, ప్రేమ, ఎమోషన్స్.. వీటన్నింటితో పాటు దేశభక్తి మేళవించే ఛాన్సుంది. పైగా ఇవి మూడూ మంచి కమర్షియల్ పాయింట్లే. సో.. పూరి కమర్షియల్ కథని వదిలేసి ఎక్కడికీ పారిపోలేదు. కాకపోతే… దాన్ని ప్రజెంట్ చేసే పద్ధతిలోనే పూరి.. మారే ప్రయత్నం చేశాడు. పూరి సినిమాల్లో, కథల్లో కనిపించే రెగ్యులర్ హీరో మెహబూబాలో లేడు. అది ఓ రకంగా మార్పే. ఒకవేళ ఇడియట్లో రవితేజలా.. పూరి ఆకాష్తోనూ పవర్ఫుల్డైలాగులు చెప్పిస్తే.. తొలి సన్నివేశాల్లోనే ఈ సినిమా ఈడ్చి కొట్టేద్దును. ఎందుకంటే.. పూరి ఆకాష్‌కి ఇంకా అంత వయసూ, స్టామినా రాలేదు. నిజానికి ఈ జోనర్ కథ ఇప్పుడే ఎంచుకోవాల్సింది కాదు. ఆకాష్‌కి ఇంకా వయసుంది. మీసాలే సరిగా మొలవలేదు. అతని వయసుకి పునర్జన్మ, యుద్దాలు అనేది బరువైన అంశాలే. ఆకాష్ ఫైటింగ్ చేస్తున్నా, ఎమోషన్ సీన్లు చేస్తున్నా.. ఇంకా అతన్ని `బాల నటుడి`గానే కనిపిస్తుంటాడు. ఈ సినిమాకి అదో పెద్దమైనస్.
ఓ జన్మలో ప్రేమికులు విడిపోయి.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే – ఎంత ఎమోషన్ పండాలి? ఎంత ఉద్వేగానికి గురవ్వాలి? అవేం.. మెహబాబూలో కనిపించవు. `చచ్చారా, మళ్లీ బతికారా.. కానివ్వండి` అన్నట్టు ప్రేక్షకుడూ రిలాక్స్ అయిపోతాడు. ఈకథకి ఎప్పుడైతే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేదో.. తెరపై ఎన్ని ఎమోషన్లు పండితే ఏంటి? పండకపోతే ఏంటి? విశ్రాంతి వరకూ పూరి.. కాలక్షేపం చేశాడు. హీరో, హీరోయిన్లతో దాగుడు మూతలు ఆడించి.. విశ్రాంతి ముందు చిన్న ట్విస్టులాంటి ముడి పెట్టి.. ఛాయ్ బ్రేక్ ఇచ్చాడు. తిరిగొచ్చాక ప్రీ క్లైమాక్స్ వరకూ ఫ్లాష్ బ్యాక్‌తో నడిపించాడు. దేశభక్తిని చాటి చెప్పే సన్నివేశాలు రాసుకొనే అవకాశం పూరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని సద్వినియోగ పరచుకున్నాడు. ముఖ్యంగా సేవ్ టైగర్స్ గురించి ఆకాష్ చెప్పిన సంభాషణలు చప్పట్లు కొట్టిస్తాయి. పూరిలోని ఫిలాసఫీ ఈ సీన్లో బయటపడింది. ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో తీసిన సీన్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇలాంటి సీన్లు ఇది వరకు చాలా సినిమాల్లో చూసేశాం.
లాజిక్ల విషయానికొస్తే.. పూరి వాటిని ఎప్పుడో పక్కన పెట్టేశాడు. పాకిస్థాన్ నుంచి వచ్చిన హీరోయిన్… హైదరాబాద్‌లో వచ్చీ రానీ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే, పాకిస్థాన్‌లో ఉన్న విలన్, హీరోయిన్ ఇంటి సభ్యులు మాత్రం ఎంచక్కా.. తెలుగులో మాట్లాడేస్తుంటారు. పోనీలే… ఇదంతా మన సౌలభ్యం కోసం అనుకోవాలి. సినిమా అంతా ఎలా సాగినా.. పతాక సన్నివేశాల్లో ఏదో మ్యాజిక్ చేసి పాసైపోతుంటాడు పూరి. ఇక్కడా అలాంటి మాయ కనిపిస్తుందని ఆశిస్తే.. నిరాశ ఎదురైంది. క్లైమాక్స్ మరీ వీక్‌గా తీశాడు. ఆ సీన్లన్నీ చుట్టేశాడు. ప్రేమ తాలుకూ పెయిన్ గానీ, పునర్జన ఎఫెక్ట్ గానీ.. ఈ మెహబూబాలో కనిపించదు. పూరి సినిమాల్లో కనిపించే వేగం.. పూర్తిగా మందగించింది. అది మెహబూబాని బాగా దెబ్బ కొట్టింది.
నటీనటులు
ఆకాష్ పూరి మంచి నటుడే. చిన్నప్పటి నుంచీ తనని చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ పాత్రని మోసే వయసు, అనుభవం ఇంకా తనకు రాలేదనిపించింది. మరో రెండేళ్లు ఆగి ఈ కథ తీసుంటే కనీసం తన పాత్రకైనా తాను న్యాయం చేసేవాడు. నేహా శెట్టి అందంగా ఉంది. అయితే ఆకాష్ పక్కన అక్కలా కనిపిస్తుంది. మురళీ శర్మ, షాయాజీ షిండే తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన ఏ పాత్ర రిజిస్టర్ అవ్వదు
సాంకేతిక వర్గం
సందీప్ చౌతా అందించిన పాటల్లో మెహబూబా బాగుంది. మంచి మెలోడీ. నేపథ్య సంగీతంలోనూ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. దర్శకుడి కంటే మాటల రచయితగా పూరి మెప్పిస్తాడు. అయితే అది కూడా అక్కడక్కడే. సినిమా మొత్తం ఆ ప్రభావం కనిపించి ఉంటే… కనీసం రచయితగానైనా పూరి ఈ సినిమాని గట్టెక్కించేవాడు.
తీర్పు
దర్శకుడిగా తాను నిరూపించుకోవడం కోసం, తనయుడ్ని హీరోగా చూసుకోవడం కోసం పూరి.. చేసిన ప్రయత్నం ఇది. అసలే రెండు భారాలు. దాంతో పాటు నిర్మాతగానూ అదనపు భారం మోశాడు. ఆ బరువుకి తోడు… పునర్జన్మ అనే పాత కాన్సెప్ట్ అందుకున్నాడు. ఇన్ని బరువులు మోయలేక.. యుద్ధానికి వెళ్లాల్సిన పూరి.. బోర్డర్‌కి ఇవతలే చతికిల పడ్డాడు.
ఫినిషింగ్ టచ్: ఇండియా పాకిస్థాన్ లబ్ డబ్ లబ్ డబ్
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5