హీరోకి బాధ్యతల్లేవు. ఎవరి ముందైనా తల ఎగరేసి బతుకుతాడు. బలాదూర్ తిరిగేస్తుంటాడు. అతన్నో ఇడియట్గా చూస్తుంటారు జనాలు. ఆ పోకిరితనమే.. హీరోయిన్‌కి నచ్చేస్తుంది. సులభంగా ఇద్దరూ ప్రేమలో పడిపోతారు – పూరి జగన్నాథ్ సినిమాల్లో లవ్ స్టోరీ ఇలానే ఉంటుంది. హీరోని ఆవారాగా చూపించి, దాని చుట్టూ వినోదం పండించడంలో దిట్ట పూరి. అయితే.. ఆ ట్రెండ్, అలాంటి హీరోయిజం జనాలకే కాదు, పూరికీ విసుగొచ్చేసి నట్టు ఉంది. అందుకే ‘మెహబూబా’ విషయంలో రూటు మార్చాడు. పూరి తన తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా పరిచయం చేస్తున్న సినిమా ఇది. ట్రైలర్ బయటకు వచ్చింది. 2 నిమిషాల ఈ ట్రైలర్లో పూరి ఇంటెన్సిటీ అడుగడుగునా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఓ సీరియెస్ లవ్ స్టోరీ ఇది. బోర్డర్లో పరిస్థితులు, అక్కడి వాతావరణం, మనుషులు ఇండియా – పాకిస్థాన్వైరం ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించేశాడు పూరి. తన సినిమాల్లో ఇది కచ్చితంగా కొత్తనేపథ్యంలో సాగేదే. పూరి తరహా పంచ్ డైలాగు ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు. కథకి ఎంత కావాలో.. అంతే చూపించాడు. రెండు నిమిషాల ట్రైలర్లో ప్రేక్షకుల్ని ఓ మూడ్‌లోకి తీసుకెళ్లగలిగాడు. దేశభక్తి ఎప్పటికీ గొప్ప కమర్షియల్ వస్తువే. దానికి పూరి తనశైలి హీరోయిజం జోడించినట్టు అనిపిస్తోంది. చివర్లో ఆకాష్ పూరి చెప్పిన డైలాగ్‌లో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఆకాష్ కాస్త పీలగా కనిపిస్తున్నాడు. సోల్జర్‌గా ప్రేక్షకులు గుర్తించడానికి ఈ ఫిజిక్ సరిపోదేమో. అదొక్కటి మినహాయిస్తే.. ఈ వేసవిలో తప్పకుండా చూడాల్సిన సినిమాల జాబితాలో `మెహబూబా` కూడా చేరిపోయింది.