చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ అనగానే… అంతా ఆశ్చర్యపోయారు. ఈ కాంబినేషన్ కుదుతుందా? ప్రకటనలకే పరిమితం అవుతుందా? అని అనుమానించారు. కానీ.. తెర వెనుక పనులు మాత్రం చక చక సాగిపోతున్నాయి. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న `వేదాళం` సినిమా రీమేక్ బాధ్యతలు మెహర్ కి అప్పగించారు. నిజానికి మూడేళ్ల క్రితం నుంచే.. మెహర్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. అప్పటి నుంచీ… ఈ స్క్రిప్టు కోసమే కష్టపడుతున్నాడు. `వేదాళం` చిత్రాన్ని చిరు ఇమేజ్‌కీ, ఇక్కడి అభిమానుల అంచనాలకు తగ్గట్టు మార్పులు, చేర్పులూ చేసి కొత్త కథగా మలిచాడట మెహర్. ఈమధ్యే మెహర్ రమేష్ చిరంజీవికి పూర్తి స్క్రిప్టుని డైలాగ్ వెర్షన్ తో సహా వినిపించాడట. చిరు ఒకే ఒక్క సిట్టింగ్ లో.. ఈ స్క్రిప్టు ఓకే చేశాడని, ఒక్క కరక్షన్ కూడా చెప్పలేదని తెలుస్తోంది.
మెహర్ కి పరాజయాలు ఉండొచ్చు. కానీ.. స్టైలీష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. `వేదాళం`కీ స్టైల్ అవసరం. ఈ సినిమాని అలా తీస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. అందుకే చిరు కూడా మెహర్ పై పూర్తి స్థాయి నమ్మకాన్ని ఉంచాడట. ఈ చిత్రంలో చిరు చెల్లాయిగా సాయి పల్లవి నటించబోతోంది. సాయి పల్లవిని ఎంచుకోవాలన్న ఆలోచన కూడా మెహర్ రమేష్ దే అని, అది కూడా చిరంజీవికి నచ్చిందని తెలుస్తోంది. చిరు చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. వినాయక్, బాబిలు చిరు కోసం కథలు సిద్దం చేస్తున్నారు. `ఆచార్య` తరవాత.. ఏ సినిమాని మొదలెడతారన్నది చిరు నిర్ణయం మేర ఆధారపడి ఉంది. చిరు ఓకే అంటే.. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేయడానికి సమాయాత్తం అవుతున్నాడు మెహర్. తనకి ఇది కమ్ బ్యాక్ సినిమా. ఇండ్రస్ట్రీలో దర్శకుడిగా నిలదొక్కుకోవాలన్నా, తనపై పడిన ఫ్లాపుల ముద్ర పోగొట్టుకోవాలన్నా – `వేదాళం`తో హిట్టు కొట్టడం అత్యవసరం. అందుకే చాలా కసిగా ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడట మెహర్. చిరు ఫ్యాన్స్‌కీ ఇదే కావాలిగా. తన స్క్రిప్టుతో, మార్పులూ చేర్పులతో చిరుని మెప్పించాడు మెహర్. ఇక ఫ్యాన్స్‌ని అలరించడమే బాకీ.