మెహర్ రమేష్‌కి చిరంజీవి అవకాశం ఇచ్చాడని తెలిసిన వెంటనే… చిరు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఎందుకంటే మెహర్ మెగాఫోన్ పట్టి పదేళ్లయ్యింది. షాడో, శక్తి లాంటి డిజాస్టర్లు మెహర్ పేరు చెబితేనే భయపడేలా చేశాయి. ఓ మాదిరి చిన్న హీరోలు సైతం మెహర్‌ని దూరం పెట్టిన పరిస్థితులు. అలాంటిది.. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా పకడ్బందీగా సినిమాలు చేస్తున్న చిరు మాత్రం మెహర్‌ని నమ్మాడు.
మెహర్‌కి చిరు అవకాశం ఇవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి… మెహర్ చిరుకి అత్యంత విశ్వాస పాత్రుడు. చాలా కాలంగా చిరుతోనే ఉన్నాడు. చిరుకి సంబంధించిన వ్యవహారాలు తనే చక్కబెడుతూ వస్తున్నాడు. రెండోది తన బంధువు. చిరు కుటుంబంతో మెహర్‌కు బంధుత్వం ఉంది. వరుసకు అన్నయ్య అవుతాడు. ఓ అన్నయ్యగా… మెహర్ కెరీర్‌ని చక్కబెట్టే బాధ్యత చిరు తీసుకొన్నాడు. పైగా రిస్క్ తక్కువగా ఉన్న రీమేక్‌ని అప్పగించాడు. కాస్త దృష్టి పెట్టి తీసినా మినిమం గ్యారెంటీ ఉంటుంది. శక్తి, షాడోలా ట్రోలింగ్ మెటీరియల్ అవ్వకుండా ఉంటుంది. ఇదీ.. చిరు స్ట్రాటజీ.
సాధారణంగా ఏ కథలో అయినా చిరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కథలో, డెరక్షన్లో ఆయన వేలు పెడతారని చెప్పుకొంటుంటారు. కానీ.. భోళా విషయంలో మెహర్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట చిరు. ఎందుకంటే.. ఈ కథపై మెహర్ దాదాపు రెండేళ్లు వర్క్ చేశాడు. టీమ్ ని పెట్టుకొని… వేదాళంలో మార్పులు చేర్పులు చేసుకొన్నాడు. పేపర్ పై ఈ కథ చెప్పినప్పుడు బాగానే అనిపించింది. అందుకే చిరు సినిమా బాధ్యత మొత్తం మెహర్‌కి వదిలేశాడు.
తీరా చూస్తే.. అవుడ్డేటెడ్ టేకింగ్, మేకింగ్ తో భోళా.. బోల్తా పడింది. ఒక్క సీన్లోనూ ఎమోషన్ రిజిస్టర్ అవ్వలేదు. సీరియల్ టైపు టేకింగ్. అనవసరమైన పాత్రలు, అర్థం పర్థం లేని కామెడీతో.. విసిగించాడు. హిట్టూ, ఫ్లాపులూ రావడం చాలా సహజం. కానీ… ఇలాంటి డిజాస్టర్లు మెహర్ రమేష్ కే సాధ్యం అన్నట్టు తయారైంది ఈ సినిమా. మెహర్ ఇంతకంటే గొప్ప సినిమా తీస్తాడని చిరు అభిమానులకు కూడా తెలుసు. ఇక్కడ మెహర్ తప్పేం లేదు. ఎందుకంటే మెహర్ నుంచి ఇలాంటి ప్రాజెక్టు కాక ఇంకేం వస్తుంది? ఇక్కడ ఓడింది చిరు. తన నమ్మకం ఓడింది. తన వాళ్లకు ఓ అవకాశం ఇద్దాం.. అనే ఆలోచన ఓడింది. తమ్ముడు తమ్ముడే.. సినిమా సినిమానే. ఈ విషయం ఇప్పుడు చిరుకి బోధపడి ఉంటుంది.