నానాటికీ తీసికట్టు నాగంబొట్టు… అన్నట్టు తయారవుతోంది మెహరీన్ వ్యవహారం. సినిమా సినిమాకీ మెరుగుపడాల్సింది పోయి.. ‘గత సినిమాలోనే బెటరేమో’ అన్నట్టు కనిపిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాథతో ఎంట్రీ ఇచ్చిందీ ఈ పంజాబీ పిల్ల. ఆ సినిమాలో అందంగా కనిపించింది. అభినయంలోనూ ఓకే అనిపించుకుంది. `మహానుభావుడు`తో మరో హిట్టుకొట్టింది. అందులోనూ పెద్దగా లోపాలేం కనిపించలేదు. అయితే… ఆ తరవాతే తనలోని మైనస్సులన్నీ బయటకు వస్తున్నాయి. కేరాఫ్ సూర్య, జవాన్లలో చాలా బొద్దుగా తయారైంది. హావభావాల విషయంలో ఏమాత్రం శ్రద్ద లేదన్నట్టు కనిపిస్తోంది. ఈరోజు విడుదలైన `పంతం`లోనూ.. మెహరీన్ మైనస్సులు బలంగా కనిపించాయి. గోపీచంద్లాంటి హీరో పక్కనే ఆంటీలా కనిపిస్తుంటే, ఇక యువ హీరోలతో ఎలా సెట్టవుతుంది? మెహరీన్ రెండు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఒకటి.. తన అవతారం, రెండోది.. లిప్ సింక్. ఎవరి డైలాగుల్ని వాళ్లే చెప్పాలని చూస్తున్న కాలంలో.. ఇలా లిప్ సింక్ విషయంలోనూ ఇబ్బంది పడడం ఆశ్చర్యకరమైన పరిణామమే. ‘సినిమా వస్తే చాలు.. అదే పదివేలు’ అనుకోకుండా పాత్రల విషయంలోనూ మెహరిన్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. ఇలా వచ్చి, అలా మాయమైపోయిన తారల లిస్టులో ఈ పేరు కూడా చూసుకోవాల్సివుంటుంది. ప్రస్తుతం ‘నోటా’, ‘ఎఫ్ 2’ చిత్రాల్లో నటిస్తోందీ భామ. వాటిలో అయినా తన మైనస్సుల్ని సవరించుకుంటుందేమో చూడాలి.