మెహరీన్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. యువ హీరోయిన్లంతా జోరు జోరుగా సినిమా అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, హిట్లు కొట్టుకుంటూ స్టార్ స్టేటస్ వైపు పరుగులు తీస్తుంటే, మెహరీన్ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. ‘ఎఫ్ 2’ విజయంలో తన ప్రేమేయం ఏమీ లేకపోయినప్పటికీ, ఆ సినిమా చూపించి కొన్ని అవకాశాల్ని దొరకపుచ్చుకుంది. అందులో నాగశౌర్య సినిమా ఒకటి.
నాగశౌర్య తన సొంత బ్యానర్లో మూడో చిత్రాన్ని ఇటీవలే పట్టాలెక్కించాడు. ‘అశ్వద్ధామ’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా అనుకున్న పేరు… రష్మిక. ఛలోతో రష్మికకు తొలి అవకాశం ఇచ్చింది నాగశౌర్యనే. ఆ సినిమాతోనే రష్మిక పాపులర్ అయ్యింది. అయితే… ఈ సినిమాలో నటించడానికి రష్మిక ముందుకు రాలేకపోయింది. కాల్షీట్ల సమస్య వల్లో, పారితోషికం నచ్చకపోవడం వల్లో.. నాగశౌర్యతో నటించడానికి నో చెప్పింది. ఆమె స్థానంలో మెహరీన్ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి గానూ మెహరీన్ కి ఏకంగా 80 లక్షల పారితోషికం ఇచ్చారట. ఇప్పటి వరకూ మెహరీన్ పారితోషికం 50 లక్షల లోపే. అది ఇప్పుడు దాదాపుగా డబుల్ అయ్యింది. ఇదంతా ఎఫ్ 2 హిట్టు వలనా? లేదంటే.. హీరోయిన్లు దొరక్క అవస్థపడుతున్న నాగశౌర్య… మెహరీన్ అడిగినంత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందా? అనేది ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మరో హిట్టుగానీ ఈ అమ్మడి ఖాతాలో పడితే ఏకంగా కోటి రూపాయల హీరోయిన్ అయిపోతుందేమో.. ??