తెలుగు సినిమాల్లో అరుదుగా కథానాయికలకు యాక్షన్ సన్నివేశాలు, స్టంట్ సన్నివేశాల్లో నటించే అవకాశం వస్తుంది. ఎందుకంటే… పోరాటాలన్నీ మన కథానాయకులు చేస్తుంటారు కదా! ‘బాహుబలి’లో అనుష్క, తమన్నా… అంతకు ముందు లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి… ఫైట్లు గట్రా చేశారు. ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు మెహరీన్ స్టంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కి జోడీగా ఆమె నటిస్తున్న సినిమా ‘ఎఫ్2’. షూటింగ్ ఈ సినిమాలో హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్ధరాత్రి హీరోయిన్ని కారు ఢీ కొట్టే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. “యాక్షన్ సన్నివేశాల్లో నటించడం ఇదే తొలిసారి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడూ ఆలస్యం చేయను. ఇదో కొత్త అనుభవం” అని మెహరీన్ పేర్కొన్నారు. అనిల్ రావిపూడి ‘సుప్రీమ్’లో రాశి ఖన్నా చేత ఓ ఫైట్ చేయించారు. కామెడీగానే అనుకోండి. మరి, ఈ సినిమాలో మెహరీన్ చేత ఫైట్ చేయిస్తున్నారో? లేదా యాక్షన్ సన్నివేశాల్లో చిన్న పాత్ర మాత్రమే ఇస్తున్నారో? తెలియాలంటే కొన్నిరోజులు ఎదురు చూడక తప్పదు.