అమెరికాలోని చికాగో కేంద్రంగా కిషన్ మోదుగుముడి దంపతులు సాగించిన సెక్స్ స్కాండల్ తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించే కథానాయికల్లో పెద్ద అలజడి రేపింది. సరిగ్గా సెక్స్ స్కాండల్ వెలుగుచూసిన సమయంలో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’, ‘రాజా ది గ్రేట్’ సినిమాల హీరోయిన్ మెహరీన్ ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లారు. కెనడాలోని వాంకోవర్ నుంచి లాస్ వేగాస్‌కి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు అమెరికన్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మెహరీన్ ఫ్యామిలీని 30 నిమిషాలు విచారించినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది. మెహరీన్ తమకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు పత్రికలో పేర్కొన్నారు.
అయితే… తాను ఏ ఎవరికీ ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో బోర్డర్ సెక్యూరిటీ అధికారులకు, తనకు మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏమైంది? వంటి అంశాలను త్వరలో చెబుతానని సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు. ఇంకా మెహరీన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో ఏముందటే… “నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా వచ్చిన కథంతా తప్పే. వైరల్ ఫీవర్ వల్ల ప్రస్తుతం నేను ముంబైలో వున్నాను. అందుకని, ‘పంతం’ లాస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌కి అటెండ్ కాలేదు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత అమెరికాలో ఏం జరిగిందనేది అందరికీ చెబుతా. లాస్ వేగాస్ వెళ్తున్నప్పుడు నేను తెలుగు సినిమాల్లో నటిస్తానని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసింది. ఎందుకు అమెరికా వెళ్తున్నావని బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నించారు. తరవాత సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. దానికి నాకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. నన్ను క్షమాపణలు కోరారు. తరవాత ఎటువంటి సమస్య ;లేకుండా ప్రయాణించే వీలు కల్పించారు. ఇతరులు ఏదో చెప్పడం కంటే నేనే ఆ ఘటన గురించి చెప్పడం మంచిదని స్టేట్మెంట్ ఇస్తున్నా. అమెరికాలో నేను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయితే… కొందరు చేసిన తప్పుడు పనులను ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం బాధ కలిగిస్తోంది. తప్పు చేసిన వాళ్లకు సరైన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో మంచిది. తెలుగు సినిమాల్లో నేను నటిస్తూనే వుంటా” అన్నారు.
చివరగా మీడియాకి ఓ విజ్ఞప్తి చేశారామె. అమెరికా ఘటనకు సంబంధించి తనతో మాట్లాడకుండా తాను చెప్పినట్టు ఎటువంటి కథనాలు ప్రచురించవద్దని మెహరీన్ కోరారు.