నంద్యాల ఫలితాల అనంతరం వైసిపి మీద మీడియా సాక్షిగా అధికార పార్టీ ర్యాగింగ్ చేయడం, దాన్ని ఎదుర్కోలేక చాల మంది వైసిపి నేతలు మీడియాకి మొహం చాటేయడం తెలిసిందే. అయితే ఈ మీడియా మేనేజ్ మెంట్ సంగతి పక్కన పెడితే, ఫలితాల గురించి విష్లేషణల్లోనూ వైసిపి నేతలు ఎవ్వరూ జగన్ ని కానీ మరే ఇతర వైసిపి నేతని కానీ తప్పుపట్టలేదు. ఒక్క వాసిరెడ్డి పద్మ ప్రశాంత్ కిషోర్ ని తప్పుపట్టడం దీనికి మినహాయింపు. కానీ మొదటిసారిగా నంద్యాల ఫలితాల విషయం లో ఒక వైసిపి ఎంపీ జగన్ ని తప్పుపట్టాడు.
నెల్లూర్ ఎంపీ మేకపాటి టివి ఛానెల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ – చంద్రబాబు ని కాల్చిపడేయాలన్న జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభావం చూపాయని అంగీకరించారు. ఇదివరకు మాట్లాడిన వైసిపి నాయకులందరూ చంద్రబాబు డబ్బు వెదజల్లడం వల్ల మాత్రమే గెలిచాడని వాదిస్తూ వచ్చారు. మేకపాటి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు వైసిపి కి వ్యతిరేకంగా పనిచేసాయని, అంతకు మునుపు శిల్పా ని ఎమ్మెల్సీ కి రాజీనామా చేయడం ద్వారా వచ్చిన్ పాజిటివ్ బజ్ ని ఈ వ్యాఖ్యలు దెబ్బతీసాయని అభిప్రాయపడ్డారు. నిజానికి జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు, అలాగే రోజా చేసిన వ్యాఖ్యలు ఓటర్ల లో – ప్రత్యేకించి మహిళా ఓటర్ల లో ప్రభావం చూపించాయని అనేకమంది విశ్లేషకుల తో పాటు సామాన్యప్రజలు కూడా అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.
ఏది ఏమైనా వైసిపి లో ఒకరిద్దరు ఇలాంటి నాయకులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, వాస్తవాలని అంగీకరించడం ఆ పార్టీ కి మంచే చేస్తుంది.