దివిస్ ఫార్మా కంపెనీ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల కారణంగా అక్కడి స్థానికులు అటు ఆరోగ్య సమస్యలని పొందడమే కాకుండా, జీవనోపాధి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల తన పర్యటనలో భాగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ విమర్శలను తిప్పికొట్టడానికి మీడియాతో మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి, ఆ విమర్శలను తిప్పి కొట్టడం లో తడబడ్డట్టుగా కనిపిస్తోంది. పైగా మంత్రి వ్యాఖ్యలు పవన్ విమర్శలను మరింత బలోపేతం చేసే లా ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
కాలుష్యం కారణంగా ఉపాధి కోల్పోయే వారి గురించి మాట్లాడలేకపోయిన మేకపాటి:
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే క్యాబినెట్ తీర్మానం చేసి 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఈ ఫార్మా కంపెనీ ఇచ్చే లాగా తీర్మానించారు అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి జగన్ క్యాబినెట్ చేసిన తీర్మానం కనిపించదా అంటూ మండిపడ్డారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ లో ఉన్న లొసుగుల పై తన ఉపన్యాసం లో ఇదివరకే మాట్లాడి ఉన్నారు. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయనే ప్రభుత్వ వాదాన్ని రెండు విధాలుగా ఎండగట్టారు పవన్ కళ్యాణ్.
అందులో మొదటిది, ఫార్మా కంపెనీ కి కావలసిన ఫార్మసిస్ట్ లు కానీ , ఇతర టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగిన వారు కానీ పరిశ్రమ కాలుష్య ప్రభావిత ప్రాంతం లో ఎంతమంది ఉన్నారంటూ ఆయన ఉపన్యాసం లో ప్రశ్నించారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప నిజంగా 75 శాతం ఉద్యోగాలు కాలుష్య ప్రభావిత ప్రాంతం స్థానికులతో భర్తీ చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అక్కడి ప్రజల్లో కూడా దాదాపు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం.
ఇక రెండవది, ఈ పరిశ్రమ కారణంగా లభించే మొత్తం ఉద్యోగాలు 15000 మించవు అని, కానీ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం కారణంగా హేచరీస్, ఆక్వా లో జీవనోపాధి కోల్పోయే వారి సంఖ్య దాదాపు లక్షన్నర దాకా ఉంటుందని ఉపన్యాసంలో ఇదివరకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇదివరకు ప్రస్తావించి ఉన్న విషయాలనే మళ్లీ చెప్పడం ద్వారా మేకపాటి, పవన్ విమర్శలను దీటుగా తిప్పికొట్టడం లో తడబడినట్లుగా కనిపిస్తోంది.
సామాజిక ప్రభావ అంచనా చేసిన రాంకీ కి సంబంధించిన విమర్శలు:
అంతేకాకుండా వైయస్సార్ సిపి పార్టీ అనుకూలురది గా పేరు ఉన్న రాంకీ సంస్థలతో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించారు అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై కూడా మంత్రి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు.
ఫార్మా కంపెనీ వారు తాము అసెస్మెంట్ రాంకీ సంస్థకు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది వారి స్వంత అసెస్మెంట్ అని, ప్రభుత్వం తరఫున చేయాల్సిన అసెస్మెంట్ చెన్నైకి చెందిన వేరే కంపెనీ తో చేయించామని ఆయన చెప్పుకొచ్చారు తప్పించి, రాంకీ సంస్థలకి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన బలంగా చెప్పలేకపోయారు.
గతంలో జగన్ మాట్లాడిన వీడియోల పై మంత్రి గప్చుప్:
గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జగన్, ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వంపై కంపెనీ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని, చంద్రబాబు పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుని అనుమతులు ఇచ్చాడని అప్పట్లో వ్యాఖ్యలు చేసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి అనుమతి మంజూరు చేశారు అంటూ పవన్ కళ్యాణ్ వీడియో సాక్షాలతో సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. మేకపాటి దీనిని తిప్పి కొట్టడంలో కూడా విఫలమయ్యారు. అప్పుడు చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు అంటూ ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించారు కానీ, ఎదురుదాడి పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోయింది. “తమ నేత మాట ఇస్తే మడమ తప్పడు” అన్న భరోసాని ప్రజలకు కలిగించడంలో మంత్రి విఫలమైనట్లు కనిపిస్తోంది.
మొత్తానికి దివిస్ ఫార్మా కంపెనీ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను పరామర్శించడానికి పవన్ చేసిన పర్యటన అధికార పార్టీని బాగానే ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది.